|| నాందెడ్ సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్ ||
ఈవార్తలు : తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశవ్యాప్తంగా ప్రచారం మొదలు పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల యాత్రను ఛత్రపతి శివాజీ సొంతూరు శివనేరి నుంచి మొదలుపెడతామని ప్రకటించారు. ఆదివారం నాందేడ్‌లో బహిరంగ సభను నిర్వహించి.. పలువురు స్థానిక నాయకులను పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, పూలే వంటి మహనీయులు జన్మించిన మహారాష్ట్రలో సభ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన మహారాష్ట్ర నుంచే, అదీ శివాజీ పుట్టిన శివనేరి నుంచే బీఆర్ఎస్ ఎన్నికల యాత్రను మొదలు పెడతామని వెల్లడించారు. మరో పదిరోజుల్లో దీని కార్యాచరణ ఉంటుందని వివరించారు. బీఆర్ఎస్ ఆవిర్భావంపై మాట్లాడుతూ దేశ పరిస్థితులను చూసి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చామని తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా దేశంలో మార్పులు రాలేదని, ఇప్పటికీ కనీస తాగునీరు, విద్యుత్తు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ప్రజల్లోకి వస్తున్నామని వెల్లడించారు. నాగలి పట్టిన చేతులు శాసనాలు రాయాల్సిన రోజులు వచ్చాయని పిలుపునిచ్చారు. తాము చేపట్టిన పోరాటం రాజకీయ పోరాటం కాదని, జీవన్మరణ పోరాటం అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదని, ప్రజలు, రైతులేనని కుండబద్ధలు కొట్టారు. స్వాతంత్య్రం తర్వాత 54 ఏళ్లు కాంగ్రెస్ పాలిస్తే, 16 ఏళ్లు బీజేపీ పాలించిందని.. అయినా దేశం సాధించింది ఏమీ లేదని విమర్శించారు. రోజులు ఆరోపణలు, విమర్శలతోనే సరిపోతున్నాయని దేశాన్ని బాగు చేసే ఉద్దేశం ఆ పార్టీలకు లేదని మండిపడ్డారు.
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, అక్కడ సాధ్యమైంది, దేశమంతటా ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. రైతు సంక్షేమ, ప్రజా సంక్షేమ పథకాలు రావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిందేనని తేల్చి చెప్పారు. తమకు అధికారం ఇస్తే రైతులకు 24 గంటల విద్యుత్తు అందజేస్తామని హామీ ఇచ్చారు. దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతటా రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.