తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల ప్రధానాధికారి కీలక వ్యాఖ్యలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల ప్రధానాధికారి కీలక వ్యాఖ్యలు||

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. శనివారం బీఆర్కే భవన్‌లో మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు 2, 3 నెలల సమయమే ఉందని, ఈ నేపథ్యంలో అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ముఖ్యంగా యువత, మహిళలు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వివరించారు. యువతే 6.99 లక్షల మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు.

ఎన్నికల నిర్వహణపై మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరుగుతుందని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సజావుగా నిర్వహించనున్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈవీఎంల తనిఖీ జరుగుతోందని, తుది జాబితా పూర్తయ్యాక జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్రాల పరిధిలో 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతున్నట్లు వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్