Telangana Assembly Elections 2023 | తెలంగాణవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి.. ఓటర్లు ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాాత్మక చిత్రం||

హైదరాబాద్, ఈవార్తలు ప్రతినిధి: ( Telangana Assembly Elections 2023 )ఈ నెల 30వ తేదీన జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం నుంచే 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చిందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమికూడవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేస్తామని, అక్కడి నుంచి పోలింగ్‌ కేంద్రాలకు వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మాక్‌ పోలింగ్‌ కోసం గురువారం ఉదయం 5.30 గంటల కల్లా అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి రావాలని ఆదేశించారు. అటు.. రాష్ట్రంలో 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 27,094 కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు రూ.737 కోట్ల విలువైన నగదు, వస్తువులు, మద్యాన్ని సీజ్‌ చేశామని వెల్లడించారు.

రేపు సెలవు ఇవ్వకపోతే కేసు

పోలింగ్‌ సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలున్న విద్యాసంస్థలకు బుధ, గురువారాల్లో సెలవు ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న విద్యాశాఖ సిబ్బందికి బుధ, గురువారాల్లో సెలవుతోపాటు డిసెంబర్‌ 1న స్పెషల్‌ క్యాజువల్‌ లీవుగా ప్రకటించారు. అయితే, కొన్ని ఐటీ సంస్థలు పోలింగ్ రోజున సెలవు ప్రకటించకపోవడంపై వికాస్‌రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ సంస్థల హెచ్ఆర్‌లకు ప్రభుత్వ ఉత్తర్వు కాపీ చూపించాలని ఉద్యోగులకు ఈసీ సూచించింది. అయినా సెలవు ఇవ్వకపోతే కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

ఓటర్లకు సూచనలు

- ఓటరు స్లిప్పులను గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోం

- ఓటరు కార్డు లేదా ఇతర 12 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకొనిరావాలి

- రాజకీయ పార్టీలు ఇచ్చే ఓటరు స్లిప్పుపై అభ్యర్థి పేరు, గుర్తు, పార్టీ పేరు ఉండకూడదు.

- ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలోకి ఫోన్‌ తీసుకొనిరావద్దు. 

- ఓటును ఫొటో తీయడానికి కూడా వీల్లేదు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్