రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు రెండు నెలలు కావస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నామినేటెడ్ పోస్టులు భర్తీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు రెండు నెలలు కావస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నామినేటెడ్ పోస్టులు భర్తీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను తెప్పించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన ఎంతో మందిని ప్రభుత్వం బలవంతంగా ఆయా పోస్టులు నుంచి తప్పించింది. వీరి స్థానంలో కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలకు అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీ నాయకులకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. ఆయా పోస్టుల్లో కూటమి పార్టీల్లోని నాయకులకు ఎంత శాతం చొప్పున కేటాయించాలన్న దానిపై అధినేతల్లో తర్జనభర్జన కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి చెందిన నాయకుల్లో పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పార్టీ నుంచి కనీసం 30 మంది నాయకులు నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. వీటిలో జిల్లా స్థాయిలో ఉన్న పోస్టులు కొన్ని కాగా, రాష్ట్ర స్థాయి పోస్టులు మరికొన్ని ఉన్నాయి. అయితే, ఆ స్థాయిలో పోస్టులు లేకపోవడంతో కేటాయింపులు ఆయా పార్టీలకు ఇబ్బందిగా మారనుంది.
ఇప్పటికే జిల్లా స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆశావహులు నుంచి వివరాలను తీసుకుంటున్నారు. వీరిలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన వాళ్లు ఎవరన్న దానిని గుర్తించి వారికి అవకాశాలను కల్పించనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి ఎక్కువ శాతం, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీలకు చెందిన నాయకులకు ఎక్కువ శాతం మేర నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. అయితే, రెండు నెలల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ వ్యవహారాన్ని ముగించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు. ఇది పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గౌరవించినట్టు అవుతుందని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే టీడీపీ జోరుగా పావులు కదుపుతోంది. జిల్లాలు నుంచి అశావహ అభ్యర్థులు వివరాలను సేకరిస్తోంది. వీరిలో పార్టీకి సేవ చేసిన వారికి అవకాశం కల్పించనున్నారు.