Chandrababu | పాపం చంద్రబాబు.. పరిస్థితి ఇంత దారుణంగా తయారైందేంటి.. అసలు ఇదేం ఖర్మనో?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, ఏపీ న్యూస్: చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ బొగ్గే.. ఒక ప్రతిపక్ష నాయకుడి విమర్శ..! చంద్రబాబు ఏ పార్టీతో పొత్తు పెట్టుకొంటే ఆ పార్టీ చిత్తే.. ఇంకో నాయకుడి ఎద్దేవా..! అసలే అధికారం లేక ఇబ్బందులు పడుతున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని ఏపీలో అధికార వైసీపీ ఓ ఆట ఆడుకుంటున్నది. దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా చుక్కలు చూపిస్తున్నది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు పెడితే చాలు.. చంద్రబాబుకు కావాల్సినంత అవమానం దొరుకుతోంది. ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో మూలికే నక్కపై తాడిపండు పడ్డట్టు.. ఏ సభ పెట్టినా అక్కడ చంద్రబాబుకు సమస్యే ఎదురవుతోంది. మొన్నకిమొన్న కందుకూరులో ‘ఇదేం ఖర్మ’ సభ పెట్టగా, అక్కడ తొక్కిసలాట జరిగి.. 8 మంది మృతి చెందారు. ఆ ఘటన మరువకముందే ఆదివారం గుంటూరులో పెట్టిన సభలోనూ తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతిచెందారు.

ఆదివారం గుంటూరులో కొత్త సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా.. జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి పేరుతో కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు రాగా, తొక్కిసలాట జరిగి ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటనలో మరో 20 మంది దాకా గాయాల పాలయ్యారు. అక్కడున్న బారికేడ్లు తోసుకుంటూ జనం ముందుకు రావటంతో ఒకరిపై ఒకరు పడి తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు కన్నావారితోటకు చెందిన సయ్యద్ ఆసియా (48), ఏటీ అగ్రహారానికి చెందిన గోపిదేశి రమాదేవి (50), మారుతీనగర్ నాయిబ్రాహ్మణ కాలనీకి చెందిన షేక్ బీబీ (55) మృతిచెందారు. ఈ ఘటన మరోసారి చంద్రబాబు మెడకు చుట్టుకుంది. కందుకూరులో సభ పెట్టి 8 మంది ఉసురు తీసుకున్నాడని, ఇప్పుడు గుంటూరులో సభ పెట్టి ముగ్గురు అమాయక మహిళలను చంపేశాడని సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కోడై కూస్తున్నాయి. వాస్తవానికి సీఎం జగన్‌ను విమర్శించటానికి పెట్టిన ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం రివర్స్ కావటం గమనార్హం.

ఇప్పుడంతా చంద్రబాబు సభ పెడితే ‘ఇదేం ఖర్మ’రా! అని మాట్లాడుకొంటున్నారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆయనపై జోకులు పేల్చుతున్నారు. ఈ వ్యవహారంలో కేఏ పాల్‌ను కూడా కలిపేశారు. సొంత డబ్బా కొట్టుకోవటంలో కేఏ పాల్ ముందుంటాడు అనుకుంటే.. చంద్రబాబు ఆయన్ను మించి పోయాడని ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అసలే అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో తొక్కిసలాట ఘటనలు చంద్రబాబును మరింత ఒత్తిడికి గురి చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి చొచ్చుకొని పోతుండగా, చంద్రబాబు తొక్కిసలాట ఘటనలకు బాధ్యుడు అవుతున్నారని అంటున్నారు. చంద్రబాబు మరోసారి సభ పెడితే.. అక్కడ కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకొంటే.. బాబు పని ఖతం! అని సోషల్ మీడియాలో గుసగుసలాడుకోవటం కొసమెరుపు.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్