బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడి విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి సొంత దేశంలోనే సైన్యం చేతిలో తల్లిదండ్రులు, సోదరులను కోల్పోయి భారత్ లో ప్రవాసంలో గడిపి మాతృభూమికి తిరిగెళ్లి ప్రధానిగా రికార్డు కాలం పని చేసిన షేక్ హసీనా జీవితంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బంగ్లా జాతిపిత షేక్ ముజ్బీర్ రెహమాన్ కుమార్తె అయిన ఈమె భారత్ - పాక్ విభజన జరిగాక 1947 సెప్టెంబర్ లో జన్మించారు. 1960 చివరిలో పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కావాలంటూ బంగ్లా ప్రజలు సాగించిన ఉద్యమంలో హసీనా కీలక పాత్ర పోషించారు.
షేక్ హసీనా
గడిచిన రెండు రోజుల నుంచి బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా నిరసనలతో దేశ వ్యాప్తంగా ప్రారంభమైన ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుకుతోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా సమర్పించారు. అనంతరం ఆమె భారత్ కు వెళ్ళిపోయినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన హసీనా గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడి విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి సొంత దేశంలోనే సైన్యం చేతిలో తల్లిదండ్రులు, సోదరులను కోల్పోయి భారత్ లో ప్రవాసంలో గడిపి మాతృభూమికి తిరిగెళ్లి ప్రధానిగా రికార్డు కాలం పని చేసిన షేక్ హసీనా జీవితంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బంగ్లా జాతిపిత షేక్ ముజ్బీర్ రెహమాన్ కుమార్తె అయిన ఈమె భారత్ - పాక్ విభజన జరిగాక 1947 సెప్టెంబర్ లో జన్మించారు. 1960 చివరిలో పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కావాలంటూ బంగ్లా ప్రజలు సాగించిన ఉద్యమంలో హసీనా కీలక పాత్ర పోషించారు. తండ్రిని పాక్ పాలకులు జైలులో పెట్టగా ఆయన స్థాపించిన ఆవామీ లీగ్ పార్టీ బాధ్యతలను ఆమె చూశారు. 1971లో దేశానికి స్వాతంత్రం అనంతరం ముజ్బీర్ తొలుత అధ్యక్షుడు, తర్వాత ప్రధాని అయ్యారు. మరో నాలుగేళ్లకే ఆయనతోపాటు భార్య, ముగ్గురు కుమారులను సైన్యం అధికారిక నివాసంలోనే చంపేసింది. హసీనా చెల్లెలితో రహనాతో కలిసి విదేశాల్లో ఉండడంతో హసీనా ప్రాణాలను దక్కించుకున్నారు. స్వదేశానికి వెళ్లలేని పరిస్థితుల్లో ఆరేళ్లు భారత్ లో ఉన్నారు. ఆవామీ లీగ్ పార్టీ అధినేత్రిగా ఎన్నికయ్యాక 1981లో బంగ్లాదేశ్ కు వెళ్లారు. సైన్యం పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలని గలమెత్తారు. గృహ నిర్బంధాలను ఎదుర్కొన్నారు. 1991లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్.. బేగం ఖలీదా జియా కు చెందిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పి) చేతిలో పరాజయం పాలయ్యింది. 1996లో తొలిసారి గెలిచి ప్రధాని అయ్యారు హసీనా. 2001లో ఓడిపోయిన 2008 ఎన్నికల్లో మరోసారి గెలిచి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తంగా 15 ఏళ్ల పాటు ఐదుసార్లు ప్రధానిగా హసీనా బంగ్లాదేశ్ కు సేవలు అందించారు.
ఇటు భారత్, అటు చైనాతో మిత్రబంధాన్ని నెరిపిన హసీనా..
హసీనా గత రెండు ఎన్నికల్లో దొడ్డి దారిన ఎన్నికయ్యారన్న విమర్శలు వచ్చాయి. భారత్, చైనాలతో బలమైన మైత్రి బంధం ఆమె అధికార పీఠాన్ని పటిష్టం చేసినా.. క్రమేనా బంగ్లావాద భావోద్వేగం పేరిట ప్రత్యర్ధులను అణచివేస్తూ అస్మదీయులకు పెద్దపీట వేయడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ఓ ర్యాలీలో హసీనాపై 2004లో హత్యాయత్నం జరిగింది. అనంతరం ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారు. 1971 యుద్ధ నేరాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యర్థి పార్టీ అగ్రనేతలు కొందరిని దోషులుగా తేల్చింది. 2013లో బీఎన్పీ మిత్రపక్షం జమాత్ ఏ ఇస్లామీపై ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం కూడా విధించారు. అవినీతి ఆరోపణలపై ఖలీదా జియాకు 17 ఏళ్లు జైలు శిక్ష పడేలా చేశారు. దీంతో హసీనాను నియంతగా ప్రత్యర్థులు విమర్శించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ గెలిచింది. ఆరు నెలలు తిరగకుండానే రిజర్వేషన్ల కోటాపై హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు నేపథ్యంలో అభిమానులు ఐరన్ లేడీగా పిలుచుకున్న నాయకురాలు దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ లో హింసాయుత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని హసీనా భారత్ కు వచ్చేసారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ భారత్ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అయితే హసీనా భారత్ ను భద్రత కోరలేదని తెలుస్తోంది. ఆమె ఢిల్లీలోని తన కుమార్తె, ప్రపంచ ఆరోగ్య సంస్థ తూర్పు ఆసియా డైరెక్టర్ సైమా వాజిద్ ను కలిసి ఆ తర్వాత లండన్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. బ్రిటన్ ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం కల్పించలేమని సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో హసీనా కొంతకాలం భారతలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి.