అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం.. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ : కేటీఆర్

ఢిల్లీ పర్యటనలో ఉన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

ktr delhi

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్

ఢిల్లీ పర్యటనలో ఉన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అర్హత లేకపోయినా సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి కోట్లాది రూపాయల పనులు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. అమృత్ టెండర్లకు సంబంధించి జరిగిన అవినీతి వ్యవహారాలపై తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అమృత పనుల కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన రూ.8888 కోట్ల పనులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధాన చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఆరోపణలు చేసి సైలెంట్ గా ఉండడం తగదని, ఈ వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన ప్రధాన మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము ఢిల్లీకి వస్తామని, దేశ ప్రజల దృష్టికి మోసాలను తీసుకువస్తామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి తన బావమరిదికి అమృతాన్ని పంచి, కొడంగల్ ఫార్మాతో ప్రజలకు విషాన్ని ఇస్తున్నారని విమర్శించారు.

రేవంత్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ప్రభుత్వానికి నమ్మకం ఉంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి వచ్చి ఎండగడతామని, తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని మరోసారి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్