తెలంగాణ రాజముద్ర మార్పుపై రిటైర్డ్ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ చిహ్నం కేవలం తెలంగాణ చరిత్రకే కాక, తెలుగువారి చరిత్రకు అద్దం పడుతుందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో పలు వ్యాఖ్యలు చేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు
తెలంగాణ రాజముద్ర మార్పుపై రిటైర్డ్ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ చిహ్నం కేవలం తెలంగాణ చరిత్రకే కాక, తెలుగువారి చరిత్రకు అద్దం పడుతుందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో పలు వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర చిహ్నం కేవలం తెలంగాణ చరిత్రకేగాక, తెలుగు వారి చరిత్రకు అద్దం పడుతుంది. రెండు ప్రధానమైన రాజవంశాలు.. కాకతీయులు కేవలం తెలంగాణ ప్రాంతాన్ని కాక ఆంధ్రాప్రాంతంలో కూడా చాలా ప్రాంతాన్ని పాలించారు. వారి రాచరికపు ఆనవాళ్లు ఈ నాటికి ఉన్నాయి. ఇక కుతుబ్ షాహీ వంశం భారతదేశంలోని ముస్లిం వంశాలన్నింటిలో చాలా విశాలమైన దృక్పథంతో పాలన జరిపిన వంశం. రామదాసు నుంచి భద్రాద్రి దాకా, అక్కన్న మాదన్నల దాకా మన చరిత్ర కుతుబ్ షాహీలతో ముడిపడి ఉన్నది. శివాజీ మహారాజ్ దక్షిణ భారత విస్తరణకు మూలం కుతుబ్ షాహీల హైదరాబాద్. నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతవాసి కందుకూరు జనార్దనస్వామిపై జనార్దన శతకాన్ని రాసిన కందుకూరి రుద్రకవి ఆ రోజుల్లో కుతుబ్ షాహీ ఆస్థానానికి వచ్చి సన్మానాలను అందుకున్నాడు. ఒక రకంగా ఈ చిహ్నం తెలుగువారి చరిత్రకు అద్దం పడుతుంది. దీనిని మార్చాలి అనుకోవటం సరి కాకపోవచ్చు’ అని వ్యాఖ్యలు చేశారు.
కాగా, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజముద్రను మార్చుతున్న విషయం తెలిసిందే. సమ్మక్క సారలమ్మ, అమరుల త్యాగాలను గుర్తుచేసేలా చిహ్నం ఉంటుందని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాన్ని ప్రతిబింబించేలా ఈమధ్యే ఒక లోగో బయటకు వచ్చింది. అయితే, ప్రస్తుతం దానిపై భిన్నాభిప్రాయాలు ఉండటంతో కేవలం గీతాన్ని విడుదల చేసి, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.