రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు.. చంద్రబాబుకు త్వరలోనే బుద్ధి చెబుతారు : వైయస్ జగన్

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రాన్ని రావణకాష్టకం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

 YS Jagan

 వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రాన్ని రావణకాష్టకం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అన్యాయంగా కేసులు పెట్టి నిర్బంధించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వాయి గేటు వద్ద పోలింగ్ రోజు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే రామకృష్ణారెడ్డి ఈవిఎం పగలగొట్టారని, కానీ హత్యాయత్నం చేశాడంటూ కేసులను నమోదు చేయడం దారుణం అన్నారు. టిడిపి నాయకులు రిగ్గింగ్ చేస్తుంటే ఎమ్మెల్యే అడ్డుకున్నారని, ఆయనపై పది రోజులు తర్వాత హత్యాయత్నం చేశాడంటూ కేసు నమోదు చేయడం దారుణం అన్నారు. మరి ఫిట్ రిపోర్టులో ఈ విషయం ఎందుకు రాలేదన్నారు. నాలుగు సార్లు వరుసగా గెలిచిన వ్యక్తిపై ఈ తరహాగా వ్యవహరించడం దారుణమన్నారు. తప్పుడు కేసుల్లో నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదేవిధంగా దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం చేస్తున్నారన్నారు. అత్యంత దారుణంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్లే కొట్టి తిరిగి వైసిపి శ్రేణులపై దాడులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

ఈ తరహా దాడులను ఇప్పటికైనా ఆపాలని, లేకపోతే అంతే స్థాయిలో రియాక్షన్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదన్న ఏకైక కారణంతో ఏకంగా ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతుందని విమర్శించారు. గడచిన ఐదేళ్ల వైసిపి పాలనలో అప్పుడు జగన్ ఏం చేశాడని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా.. అర్హతను ప్రామాణికంగా తీసుకొని మంచిని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేశామన్నారు. కానీ ప్రస్తుతం టిడిపికి ఓటు వేయలేదు అన్న కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు కొట్టి కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైయస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శశిపాలుడు పాపాలు పండినట్లు చంద్రబాబు నాయుడు పాపాలు పండుతున్నాయి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవాలన్నారు.

ప్రజలు ఎందుకు ఓటు వేశారు చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబుకు సూచించారు. ప్రజలకు మంచి చేసి వైసిపి ఓడిపోయిందని, చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు ఓట్లేసారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సూచించారు. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఈ తరహా కక్షపూర్త రాజకీయాలు చేయడం దేనికని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని, హామీలను అమలు చేయకుండా భయాందోళనను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్