రేషన్ కార్డు ఉన్నోళ్లందరికీ ఇందిరమ్మ చీరలు
ప్రతీకాత్మక చిత్రం
మంత్రి పొన్నం వెల్లడి.. కోహెడలో చీరల పంపిణీ
సిద్దిపేట, నవంబర్ 23 (ఈవార్తలు): తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ జరిగింది. 22 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేశారు. కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయానికి 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోహెడ మార్కెట్ యార్డును పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పరిశీలించారు. గతంలో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేదని, ఇవాళ ఛైర్మన్ నిర్మల జయరాజ్, కమిటీ సభ్యులను సత్కరించారు. మార్కెట్ కమిటీకి కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని చెప్పారు. 'ధాన్యం కొనుగోలు రైతుల ఖాతాల్లో డబ్బుల జమలో ఇబ్బందులు లేకుండా అధికారులు చూసుకోవాలి. త్వరలోనే మండలానికి ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్ రాబోతుంది. డాక్టర్లే వచ్చి వైద్య పరీక్షలు చేస్తారు. ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండి. మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు పోదాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్స్, బస్సులు ఇచ్చామని మంత్రి పొన్నం చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మహిళా సంఘాల వాళ్లు చీరలు ఇస్తున్నారన్నారు. 'రాష్ట్రంలో ఎక్కడ మహిళ సంఘాల మీటింగ్ జరిగినా హుస్నాబాద్ స్టీల్ బ్యాంక్ ద్వారా ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారిందని చెప్పండి. నాకు ఒక అక్క చెల్లె ఉన్నారు. నా ఆడబిడ్డలతో సమానంగా మిమ్మల్ని చూసుకుంటాం. మీకు ఏ కష్టం రానివ్వను. గౌరవెల్లి ప్రాజెక్టు ఒక్కో మెట్టు పూర్తి చేసుకుంటున్నాం. త్వరలో పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తాం. ప్రాజెక్టులో భూమి కోల్పోయినవారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం.' అని మంత్రి పొన్నం తెలిపారు.