నా కథ చెప్తా.. వింటారా!
ఎలన్ మస్క్
బయోగ్రఫీ రాసే ఆలోచనలో ఎలాన్ మస్క్
న్యూయార్క్: టెస్లా సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన స్వీయచరిత్రను రాసే ఆలోచనలో ఉన్నారు. తన జీవితానుభవాలు, నేర్చుకున్న పాఠాలను ప్రపంచంతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రముఖ రచయిత వాల్టర్ ఐసాక్‌సన్ 2023లో మస్క్‌పై రాసిన బెస్ట్ సెల్లర్ బయోగ్రఫీ గురించి ఒక యూజర్ చేసిన పోస్ట్‌కు మస్క్ స్పందించారు. "నా కథను నేనే చెప్పాలి. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలను ఇతరులకు ఉపయోగపడేలా పంచుకోవాలి" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఐసాక్‌సన్ పుస్తకం మస్క్ బాల్యం నుంచి 2022లో ట్విట్టర్ కొనుగోలు వరకు అనేక విషయాలను ప్రస్తావించినా, ఇంకా చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మస్క్ పుస్తకం రాస్తే, 2023 నుంచి 2025 మధ్య కాలంలోని కీలక పరిణామాలకు అందులో చోటు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం, ట్రంప్‌కు మద్దతు, టెస్లా భవిష్యత్ ప్రణాళికలు, ఆప్టిమస్ రోబో ద్వారా 20 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ లక్ష్యం, ఎక్స్ ఏఐ ద్వారా కృత్రిమ మేధస్సు రంగంలో చేస్తున్న ప్రయోగాలు వంటి అంశాలను వివరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, మస్క్‌కు అత్యంత దగ్గరగా ఉండి బయోగ్రఫీ రాసిన ఐసాక్‌సన్ సైతం ఇటీవల మస్క్ రాజకీయ ప్రవేశాన్ని విమర్శించడం గమనార్హం. మరోవైపు, ఐసాక్‌సన్ రాసిన పుస్తకం ఆధారంగా ప్రముఖ ఫిల్మ్ స్టూడియో ఏ24 ఒక సినిమాను కూడా నిర్మిస్తోంది. దీనికి డారెన్ ఆరోనాఫ్‌స్కీ దర్శకత్వం వహించనున్నారు. పుస్తకం, సినిమా ఆలోచనలు ఉన్నప్పటికీ, మస్క్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని టెస్లాపైనే కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.