కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన.. కీలక మార్పులకు సిద్ధమవుతున్న అధిష్టానం

కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులకు సిద్ధమవుతోంది. గడిచిన ఎన్నికల్లో అపజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొన్ని మార్పులు, చేర్పులకు పార్టీ అగ్రనాయకత్వం సిద్ధమవుతోంది.

Congress party headquarters in Delhi

ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం

కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులకు సిద్ధమవుతోంది. గడిచిన ఎన్నికల్లో అపజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొన్ని మార్పులు, చేర్పులకు పార్టీ అగ్రనాయకత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జైరాం రమేష్ (మీడియా వ్యవహారాల ఇంచార్జ్), కెసి వేణుగోపాల్ (సంస్థ గత వ్యవహారాలు) లను మార్చబోతున్నట్లు తెలుస్తోంది. జైరాం రమేష్ పై రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. బిజెపి విమర్శలను అనుకున్న రీతిలో ఆయన తిప్పికొట్టలేకపోతున్నారని, కొద్ది నెలల్లో జరగనున్న హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆ పదవి నుంచి వైదొలగాలని జైరాం రమేష్ ను రాహుల్ కోరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పదవి నుంచి తప్పిస్తే తనను  ఈశాన్య భారత వ్యవహారాల ఇన్చార్జిగా నియమించాలని జైరాం రమేష్ విజ్ఞప్తి చేశారని చెబుతున్నారు. రాహుల్ గాంధీకి m అత్యంత సన్నిహితుడైన కేసి వేణుగోపాలను మార్చాలనుకోవడమే పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఏఐసీసీ సంస్థ గత ప్రధాన కార్యదర్శిగా ఉన్న అశోక్ గెహ్లాత్ సీఎం గా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ పదవి చేపట్టిన వేణుగోపాల్ ఇప్పటికి కొనసాగుతున్నారు.

అయితే, వేణుగోపాల్ ను కేరళ పీసీసీ అధ్యక్షుడిగా వెళ్లాలని రాహుల్ గాంధీ కోరారని అంటున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ కూటమి యుడిఎస్ ఘన విజయం సాధించింది. 20 స్థానాల్లో 18 గెలిచింది. 2026లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సీఎం పదవికి రేసులో తానులేనని వేణుగోపాల్ చెబుతున్నప్పటికీ.. ఆయనకు ఆ ఆకాంక్ష ఉందని ఓ సీనియర్ నేత చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిసిసి పగ్గాలు చేపడితే టికెట్లు పంపిణీ తన చేతిలో ఉంటుందని, యుడిఎఫ్ విజయం సాధిస్తే తన వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉంటే తనకే సీఎం పీఠం దక్కుతుందని ఆయన భావిస్తున్నారని పలువురు సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. అందుకే రాష్ట్ర రాజకీయాల వైపు వేణుగోపాల్ వెళ్లాలనుకుంటున్నారని చెబుతున్నారు. కాగా వేణుగోపాల్ స్థానంలో సంస్థాగత ప్రధాన కార్యదర్శి పదవి రేసులో రాజస్థాన్, ఛత్తీష్ఘడ్ మాజీ సీఎంలు అశోక గెహ్లాత్, భూపేష్ భఘేల్ ఉన్నట్లు తెలుస్తోంది. సోనియాకు అత్యంత విశ్వాస పాత్రుడిగా మెలిగిన గెహ్లాత్ ఏఐసిసి అధ్యక్ష ఎన్నిక సమయంలో అధిష్టానాన్ని ధిక్కరించారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి కారణమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు మళ్ళీ ఇంతటి కీలక పదవిని రాహుల్ అప్పగిస్తారా..? అనేది అనుమానమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బఘేల్ ప్రియాంకకు సన్నిహితుడు. ఆయన్ను సంస్థగత ఇంచార్జిగా నియమిస్తే పార్టీలో ప్రియాంక పాత్ర పెరుగుతుందని, రాహుల్ సన్నిహితులు తగ్గిపోతారని కొందరి వాదన. అయితే, మార్పులపై రాహుల్ గాంధీదే తుది నిర్ణయమని ఏఐసిసి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని కీలక స్థానాల్లోనూ యువ నాయకులకు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో కొన్నిచోట్ల పిసిసి అధ్యక్షులు మార్చనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే సూచాయగా చెప్పింది. ఈ జాబితాలో తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ మార్పులను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం చేస్తోందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు చెబుతున్నారు. చూడాలి ఈ మార్పులు కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకు మేలు చేయనున్నాయో.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్