కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ సహచర ఎంపీలకు కీలక సూచనలు చేశారు. బిజెపితోపాటు ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు చెందిన ఎంపీలకు ఆయన పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరుకు సంబంధించి దిశా, నిర్దేశం చేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ ను అవమానిస్తూ ప్రవర్తించారని, ఈ తరహాలో ఎన్డీఏ సభ్యులు ఎవరూ చేయవద్దని ప్రధాని మోదీ సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ
కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ సహచర ఎంపీలకు కీలక సూచనలు చేశారు. బిజెపితోపాటు ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు చెందిన ఎంపీలకు ఆయన పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరుకు సంబంధించి దిశా, నిర్దేశం చేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ ను అవమానిస్తూ ప్రవర్తించారని, ఈ తరహాలో ఎన్డీఏ సభ్యులు ఎవరూ చేయవద్దని ప్రధాని మోదీ సూచించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కూడా రాహుల్ గాంధీ సభలో అవమానకర ప్రసంగం చేశారని, ప్రధాని దుయ్యబట్టారు. ఆయనలా ఎవరు ప్రవర్తించొద్దంటూ ఎన్డీఏ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఎంపీలు పార్లమెంటరీ విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎన్డిఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అధికారపక్ష ఎంపీలకు ప్రధాని ఈ మేరకు తగిన సలహాలను, సూచనలను అందించారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై పరోక్షంగా తీవ్రస్థాయిలో ప్రధాని విమర్శలు గుప్పించారు.
పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత సోమవారం వ్యవహరించిన తీరు అమర్యాదకరమన్నారు. స్పీకర్ స్థానాన్ని ఆయన తీవ్రస్థాయిలో అవమానించినట్లు విమర్శించారు. ఆయనలా ఎన్డీఏ సభ్యులందరూ ప్రవర్తించొద్దంటూ హితవు పలికారు. కొన్ని దశాబ్దాలపాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పెట్లో ఉంచుకుందని, కానీ తమ ప్రభుత్వం దేశ నేతలు అందరికీ సమాన గౌరవం ఇస్తోందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతి ఎంపీ తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్ ను సందర్శించాలని పేర్కొన్నారు. ఇందులో మాజీ ప్రధాని నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారని వెల్లడించారు. వారి జీవిత విశేషాలను ప్రజలంతా తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఎంపీలు తాము మాట్లాడలనుకున్న అంశంపై ముందుగానే అధ్యయనం చేయాలని మోదీ సూచించారు. మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండాలని, దేశ సేవకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు. ఈ మేరకు ప్రధాని ప్రసంగాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజీజు మీడియాకు వెల్లడించారు.