రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా జనసేన నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతోంది. ఒకవైపు సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు వివిధ జిల్లాల్లో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులను చేర్చుకునేందుకు జనసేన వ్యూహాలు పన్నుతోంది. అయితే, జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న నాయకులందరినీ చేర్చుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా జనసేన నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతోంది. ఒకవైపు సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు వివిధ జిల్లాల్లో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులను చేర్చుకునేందుకు జనసేన వ్యూహాలు పన్నుతోంది. అయితే, జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న నాయకులందరినీ చేర్చుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీకి చెందిన నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై కొన్ని నిబంధనలను పవన్ కళ్యాణ్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడిన నాయకులను, తీవ్రస్థాయిలో నోటు దురుసు ప్రదర్శించిన వారిని పార్టీలోకి తీసుకోకూడదన్న నిర్ణయాన్ని పవన్ తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం కారణంగానే అనేక జిల్లాల్లో బడా నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి గడిచిన ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ప్రస్తుతం జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు తమకు తెలిసిన నాయకుల ద్వారా రాయబారాలు నెరపుతున్నారు. అయితే ఈ తరహా రాయబారాలు విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. పార్టీలో చేరేందుకు రాయబారాలు పంపిస్తున్న వారిలో వివాదాస్పద నేతలు ఎక్కువగా ఉండడం, వారిపైన అవినీతి ఆరోపణలు కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నట్లు చెబుతున్నారు. గతంలో ఈ తరహా నేతలపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. అటువంటి నేతలనే పార్టీలో చేర్చుకుంటే క్యాడర్ కు తప్పుడు మెసేజ్ వెళుతుందన్న ఉద్దేశంతోనే ఆయన సైలెంట్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది. కోడలు దూకే వారిని తాను ప్రోత్సహించనని పవన్ కళ్యాణ్ ఇదివరకే తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం కూడా ఇప్పుడు ఇబ్బందిగా మారుతోంది.
పార్టీకి అండగా ఉన్నవారికి చేయూత అందించాలని..
అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి, అధికారం కోల్పోయిన తర్వాత ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పార్టీ మారాలనుకునే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు కూడా చెబుతున్నారు. అవినీతి ఆరోపణలు, కేసుల ఇబ్బందులు నేపథ్యంలోనే ప్రస్తుతం జనసేనలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు ఆయన భావిస్తున్నారు. ఈ తరహా నేతలకు టిడిపిలో చోటు లేకపోవడం, బిజెపిలో చేరిన ఉపయోగం ఉండదని భావిస్తున్న నేపథ్యంలోనే వారంతా ప్రత్యామ్నాయంగా జనసేనను చూస్తున్నారు. ఇటువంటి నాయకులను ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకున్న రానున్న రోజుల్లో మళ్లీ గోడ దూకే అవకాశం ఉందన్న ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. వీరిని అక్కున చేర్చుకోవడం కంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికి అవకాశాలను కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలను భవిష్యత్తులో సాధించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి దోహదం చేస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నిర్ణయానికి పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉంటారా..? రానున్న రోజుల్లో రాజకీయ అవసరాలకు అనుగుణంగా చేరికలపై నిర్ణయాన్ని మార్చుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది.