|| కొండగట్టులో పవన్ కల్యాణ్ వారాహి పూజలు ||
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ప్రచార వాహనం వారాహికి కొండగట్టులో వాహన పూజలు నిర్వహించారు. మంగళవారం కొండగట్టులో ఆంజనేయస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన పవన్ కల్యాణ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా పర్యటించేందుకు వారాహి ప్రచార రథాన్ని తయారు చేయించానని తన నమ్మకమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
రాజకీయాలపై మాట్లాడుతూ.. కొత్త పొత్తులు కుదిరితే కలిసేందుకు ఎప్పుడు ముందు అడుగు వేస్తూనే ఉంటామని, భారతీయ జనతా పార్టీతో కలిసే ఉంటామని వెల్లడించారు. ఏది ఏమైనా ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా తాము ఎప్పుడు అడుగు ముందుకువేస్తూ ఉంటామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో తమ పొత్తు జాతీయ స్థాయిలో జరగాల్సి ఉంటుందేమో అని తెలిపారు. తమ ఏకైక లక్ష్యం చీకటి జీవో నెంబర్ 1 ఏపీ ప్రభుత్వ విపక్షణాలను అణిచివేయాలని అందుకే ముందడుగు వేస్తున్నానని ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిమిత సంఖ్యలోనే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. 25 నుంచి 40 అసెంబ్లీ స్థానాలు, 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఏపీతో పోల్చితే తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని, ఏపీ తరహా నాయకత్వం తెలంగాణలో ఉండుంటే ఇంత అభివృద్ధి చెందేది కాదని అభిప్రాయపడ్డారు.
నారసింహా క్షేత్రాల సందర్శనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 32 నరసింహ క్షేత్రాలను దర్శనం చేసుకుంటారు. అందులో భాగంగా నారసింహ క్షేత్రాల సందర్శన ధర్మపురి నుండి యాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.