కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్న బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొద్దిరోజుల్లో కొలువుదీరనుంది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ
కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్న బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొద్దిరోజుల్లో కొలువుదీరనుంది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలను ఆహ్వానించారు. అలాగే ఎన్డీఏ అగ్రనేతలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఏక్నాథ్ షిండే తదితరులు కూడా మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. పాత మంత్రులను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశాలు కల్పించే ఛాన్స్ ఉంది. గత క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ సొంత రాష్ట్రం తమిళనాడులో బిజెపి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా..? లేదా..? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అలాగే గడిచిన క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, వి మురళీధరన్, అజయ్ మిశ్రా తేని, మహేంద్ర నాథ్ పాండే, కౌశల్ కిషోర్, సాద్వి నిరంజన్ జ్యోతి, అర్జున్ ముండా, కైలాష్ చౌదరి, ఆర్కే సింగ్ సహా 15 మంది తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో మోదీ పూర్తిగా కొత్త టీమ్ ను ఎంచుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. కీలకమైన ఆర్థిక, హోమ్, రక్షణ, విదేశాంగ, వాణిజ్య శాఖల మినహా మిగతా మంత్రిత్వ శాఖలను మిత్రపక్షాలకు కేటాయించేందుకు మోదీ సుముఖంగా ఉన్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. మోదీ మంత్రివర్గంలో 50కిపైగా మంత్రులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మోదీ 3.0 కేబినెట్ లో 24 నుంచి 26 మంది క్యాబినెట్ మంత్రులు, దాదాపు 30 మంది సహాయ మంత్రులు ఉండవచ్చని సమాచారం. బిజెపి నుంచి 10-15 మందికి క్యాబినెట్ లో అవకాశం కల్పించవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్యాబినెట్ కూర్పుపై తెలుగుదేశం, బిజెపి మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయని సమాచారం. ఇతర పక్షాలైన జేడీయుకి రెండు, ఎల్జిపి, ఆర్ఎల్డి, శివసేన, ఎన్సిపి అజిత్ పవర్ కు ఒక్కోటీ చొప్పున మంత్రి పదవులు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలుగా గెలిచిన పలువురు బిజెపి నాయకులకు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.