ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యక్రమాల్లో పాల్గొనకుండా 1966లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించగా, ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ మోదీ ప్రభుత్వం జబర్దస్త్ డెసిషన్ తీసుకుంది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదారు దశాబ్దాలుగా ఆరెస్సెస్‌పై ఉన్న ఒక నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యక్రమాల్లో పాల్గొనకుండా 1966లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించగా, ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ మోదీ ప్రభుత్వం జబర్దస్త్ డెసిషన్ తీసుకుంది. ఈ మేరకు ఒక ఉత్తర్వు జారీ చేసింది. మహాత్మాగాంధీని నాథూరాం గాడ్సే హత్య చేసిన అనంతరం ఆరెస్సెస్‌పై నిషేధం విధించారు. అయితే, సత్ప్రవర్తన కింద మళ్లీ దాని కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతించారు. కానీ మళ్లీ 1966లో నిషేధాన్ని అమలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులెవరూ సంఘ్ కార్యక్రమాల్లో, కార్యకలాపాల్లో పాలు పంచుకోకూడదని ఆదేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నిషేధం కొనసాగుతూనే ఉంది. 58 ఏళ్ల తర్వాత మోదీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని తొలగించి ఆరెస్సెస్‌కు భారీ స్వాంతన చేకూర్చింది.
ఆరెస్సెస్ సభ్యులంతా దేశభక్తులే: బీజేపీ
కేంద్రం తీసుకున్న నిషేధం ఎత్తివేత నిర్ణయం పట్ల ఆరెస్సెస్, బీజేపీ సంతోషం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపాయి. ఆరెస్సెస్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పటిష్టం అయ్యే నిర్ణయం అని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వాలు వాటి సొంత రాజకీయాల కోసం నిషేధాన్ని విధించాయని వెల్లడించింది. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ కూడా స్పందించారు. జాతీయవాద సంస్థలపై కాంగ్రెస్‌కు వ్యతిరేక భావనే ఉంటుందని, అందుకే ఆరెస్సెస్‌పై నిషేధం విధించిందని మండిపడ్డారు. ఇప్పుడు ఆ నిషేధం ఎత్తివేయడం గొప్ప నిర్ణయం అని తెలిపారు. ఆరెస్సెస్ జాతీయవాద సంస్థ అని, ఆ సంస్థలో పనిచేసే సభ్యులంతా దేశభక్తిని కలిగి ఉండేవారేనని పేర్కొన్నారు.
ఆఫీసులకు నిక్కర్లతో ఉద్యోగులు: కాంగ్రెస్
కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్ధార్ వల్లభభాయ్ పటేల్ విధించిన నిషేధాన్ని ఎత్తివేసి, మోదీ సర్కారు రాజ్యాంగానికి తూట్లు పొడించిందని విమర్శించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు నిక్కర్లతోనే వచ్చేయంటూ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ కొంటె వ్యాఖ్యలు చేశారు.