ఒకే నాణేనికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేర్వేరు ముఖాలు అని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆ నాణెం అదానీ అని విమర్శించింది. రాహుల్ గాంధీ అదానీ గురించి ఎన్నో ఆరోపణలు చేస్తారని, కానీ.. రేవంత్, అదానీ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలపై మాత్రం సైలెంట్‌గా ఉంటారని చురకలు అంటించింది.
బీఆర్ఎస్ విడుదల చేసిన ఏఐ ఇమేజ్
హైదరాబాద్, ఈవార్తలు : ఒకే నాణేనికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేర్వేరు ముఖాలు అని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆ నాణెం అదానీ అని విమర్శించింది. రాహుల్ గాంధీ అదానీ గురించి ఎన్నో ఆరోపణలు చేస్తారని, కానీ.. రేవంత్, అదానీ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలపై మాత్రం సైలెంట్‌గా ఉంటారని చురకలు అంటించింది. శత్రువులుగా నటిస్తూ.. అదానీ నుంచి మోదీ, రాహుల్ ఇద్దరూ లబ్ధి పొందేవారేనని ఆరోపించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, అదానీ, రేవంత్‌ను అదానీ ఎత్తుకున్నట్లు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్‌ను రూపొందించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదానీ బిలియన్ డాలర్ల మోసానికి, లంచాలు ఇవ్వజూపే నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్‌లో కేసు నమోదైన నేపథ్యంలో బీఆర్ఎస్ ట్వీట్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అదానీ కంపెనీ.. భారత అధికారులకు లంచాలు ఇవ్వజూపడమేగాక, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి.. నిధులు సేకరించిందని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువులు సాగర్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. అదానీ, దాని అనుబంధ సంస్థలు గత 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ సరఫరా ఒప్పందాల్లో భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇవ్వాలని చూసిందని న్యూయార్క్‌లో కేసు నమోదైంది. అమెరికా, ఇతర దేశాల మదుపర్లకు తప్పుడు సమాచారమిచ్చి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించిందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ ఇంకా స్పందించలేదు.