తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత రాజకీయాల్లో చురుగ్గా లేని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయ్యాక మొత్తానికే సైలెంట్ అయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత రాజకీయాల్లో చురుగ్గా లేని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయ్యాక మొత్తానికే సైలెంట్ అయ్యారు. జైలు నుంచి విడుదల అయ్యాక సత్యమేయ జయతే అని మెసేజ్ పెట్టిన ఆమె.. తన తండ్రిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌పై, కేటీఆర్‌పై, హరీశ్ రావుపై వరుస ఆరోపణలు చేసినా.. అరెస్టులు అంటూ మీడియా మేనేజ్‌మెంట్ చేసినా, కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి తిట్టినా కవిత లైమ్ లైట్‌లోకి రాలేదు. అసలు రాజకీయాల నుంచి కవిత తప్పుకున్నారా? అని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులకు కవిత చేసిన ట్వీట్ బీఆర్ఎస్ వర్గాల్లో జోష్ పెంచాయి.
అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదైన తర్వాత.. కవిత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టు 29 తర్వాత ఈ రోజు చేసిన మొదటి ట్వీట్‌లో ‘అఖండ భారతంలో అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయం.. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను అరెస్టు చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీవైపేనా?’ అని నిలదీశారు. దీంతో కవిత ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇన్ని రోజులు కేటీఆర్, హరీశ్‌రావును తట్టుకోవడమే కష్టమైందని.. ఇప్పుడు శివంగి కవితక్క కూడా తోడయ్యారని బీఆర్ఎస్ అభిమానులు రీట్వీట్లు చేస్తున్నారు. వెల్ కమ్ అక్కా అంటూ కామెంట్లు పెడుతున్నారు.