ఆచూకీ లేని వైసిపి ఫైర్ బ్రాండ్స్.. నైరాశ్యంలో క్యాడర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా గట్టిగా మాట్లాడిన నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఓటమి తర్వాత తమకు అండగా ఉంటారని భావించిన ద్వితీయశ్రేణి నాయకులకు, కార్యకర్తలకు కీలక నాయకులు కనిపించకపోవడంతో ఆందోళన పెరుగుతోంది. అధికార పార్టీ నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమను ఎవరు రక్షిస్తారో అన్న ఆందోళన ఆ పార్టీ కేడర్లో నెలకొంది. అధికారంలో ఉండగా కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, ధర్మాన ప్రసాదరావు, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు వంటి నేతలు అంతా గట్టిగా మాట్లాడేవారు.

Kodali Nani, Anil Kumar Yadav

కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా గట్టిగా మాట్లాడిన నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఓటమి తర్వాత తమకు అండగా ఉంటారని భావించిన ద్వితీయశ్రేణి నాయకులకు, కార్యకర్తలకు కీలక నాయకులు కనిపించకపోవడంతో ఆందోళన పెరుగుతోంది. అధికార పార్టీ నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమను ఎవరు రక్షిస్తారో అన్న ఆందోళన ఆ పార్టీ కేడర్లో నెలకొంది. అధికారంలో ఉండగా కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, ధర్మాన ప్రసాదరావు, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు వంటి నేతలు అంతా గట్టిగా మాట్లాడేవారు. అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పించిన ఈ నాయకులు.. అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ మాట్లాడడం లేదు. అడపాదడపా పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు గాని.. మిగతా నాయకులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. జనాల్లోకి రావడం మాట అటు ఉంచితే కనీసం మీడియాతో కూడా మాట్లాడేందుకు ఈ నేతలు ఎవరు ఇష్టపడడం లేదు. వీరితోపాటు మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, మేరుగ నాగార్జున, విడదల రజిని, అవంతి శ్రీనివాస్, పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, తానేటి వనిత వంటి నేతలంతా ఇప్పుడు ఎక్కడ బయట కనిపించడం లేదు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా కనీసం కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్ ను  ఆందోళనకు గురి చేస్తోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలుపును తీసుకున్నట్లే ఓటమిని కూడా హుందాగా తీసుకుంటేనే రాజకీయాలు చేయగలమన్న విషయాన్ని ఈ నేతలు మరిచిపోయి వ్యవహరిస్తున్నారు అన్న భావనను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ క్యాడర్ పై దాడులు పెరుగుతున్నాయి. దాడులు పెరుగుతున్నా వైసిపి అగ్ర నాయకులు, మాజీ మంత్రులు మాట్లాడకపోవడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. భయంతో రాజకీయాలు ఎన్నాళ్లపాటు చేస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు గృహ నిర్బంధంలో ఉంటారని, ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన అవసరం ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

ప్రజా పోరాటాలతోనే ఇరకాటంలోకి నెట్టే అవకాశం 

రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ తరహా ఇబ్బందులతో బాధపడే కార్యకర్తలకు అండగా ఉంటేనే భవిష్యత్తులో ఆ నాయకులు వెంట వారు బలంగా నిలబడేందుకు అవకాశం ఉంటుంది. తమకు ఇబ్బందులు ఉన్నాయని పార్టీ కార్యకర్తలను కాడే వదిలేస్తే భవిష్యత్తులో ఈ తరహా నేతలు వెంట నడిచేందుకు ఎవరూ రాకపోవచ్చు అన్న భావన సర్వత్ర వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వైసిపి మాజీలు పునరాలోచన చేసి రాజకీయంగా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్న చోట సదరు నేతల పరామర్శలు, ఆత్మీయ ఓదార్పులు, అండగా ఉంటాం అన్న భరోసా కావాల్సి ఉంది. ఆ దిశగా ఈ నేతలు మళ్లీ యాక్టివ్ అవుతారా..? లేదా..? అన్నది మరికొద్ది రోజులకు తర్వాత తేలనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్