||మంచిర్యాల అభ్యర్థి వినూత్న ప్రచారం||
ఈవార్తలు, మంచిర్యాల : ఎన్నికల ప్రచారంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తమ వాగ్ధాటితో మెప్పిస్తారు. మల్లారెడ్డి లాంటి వాళ్లు ప్రాసలు, జోకులతో ప్రచారాన్ని రక్తి కట్టిస్తారు. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు డైలాగులతో జోష్ పెంచుతారు. ధర్మపురి అర్వింద్ లాంటి వాళ్లు బాండ్ పేపర్‌తో ప్రజల మనసు గెలుచుకున్నారు. ప్రచారం చేసే పద్ధతిని బట్టి ఓట్లు పడతాయన్నదీ ఓ లెక్క. అయితే, మంచిర్యాలకు చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి తనదైన స్టైల్‌లో ఓట్లు అడగటం విశేషం. తాను అభివృద్ధి ఎలా చేస్తానో చెప్తూనే, ఆ పనులు చేయకపోతే సివిల్ క్రిమినల్ కేసులు పెట్టుకోవచ్చని ఓట్లు అభ్యర్థిస్తున్నాడు.
వివరాల్లోకెళితే.. మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా యువకుడు గొర్లపల్లి సురేశ్ బరిలో నిలుస్తున్నారు. ఓట్లు కావాలంటే ప్రచారం కాస్త వినూత్నంగా ఉండాలిగా. అందుకోసం తన మ్యానిఫెస్టోను ప్రకటించారు. ‘ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని కాకుండా నన్ను గెలిపిస్తే మంచిర్యాల జిల్లా రాజధాని దిశగా అభివృద్ధి చేస్తాను. మన మంచిర్యాల జిల్లాకి ఎన్ని నిధులు మంజూరవుతున్నాయో, వాటిని ఖర్చుచేసే క్రమంలో ఎక్కడెక్కడా అభివృద్ధి చెయ్యాలో అనే విషయాలను అందరిముందు చర్చించి, అందరం కలిసికట్టుగా నిర్ణయాలను తీసుకునే పద్ధతిని తీసుకువస్తాను’ అని చెప్తున్నారు.
ఇక, ప్రతి ఇంటికి అర్హతను బట్టి ఒక ఉద్యోగాన్ని కచ్చితంగా ఇస్తానని, జరిగిన అవినీతిని బయటకు తీస్తానని, అవినీతి జరగకుండా చూస్తానని హామీలు ఇచ్చారు. తనను గెలిపిస్తే ఓటర్ల బిడ్డల 30 సంవత్సాల బంగారు భవిష్యత్తును వారి కాళ్ల ముందుకు తెస్తానని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలోని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతానని హాట ఇస్తున్నారు. అంతేకాకుండా, డిజిటల్ లైబ్రరీ, కోచింగ్ హాల్స్, స్టడీ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాన్ని విద్యార్థుల కోసం ఏర్పాటుచేస్తానని వెల్లడించారు. ఈ పనులన్నీ చేయలేనిపక్షంలో తనపై సివిల్ & క్రిమినల్ కేసులు పెట్టాలని తేల్చి చెప్తున్నారు. ఈయన మ్యానిఫెస్టో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.