పార్టీ ఫిరాయింపులు వ్యవహారంపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికరమైన విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందంటూ వ్యాఖ్యానించిన కేటీఆర్.. ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే అన్నారు.
భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పార్టీ ఫిరాయింపులు వ్యవహారంపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికరమైన విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందంటూ వ్యాఖ్యానించిన కేటీఆర్.. ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయారాం, గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందని, 2014 కంటే ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలుమార్లు ఫిరాయింపులను ఆ పార్టీ ప్రోత్సహించింది అన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కు ప్రజలు తొమ్మిది సార్లు అధికారాన్ని కట్టబెట్టారని, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరుగురిని లాగేసుకుందన్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందని విమర్శించారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠిన తరం చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. దానిని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ రక్షణ చేస్తున్నామని ఒకపక్క కాంగ్రెస్ గొప్పలు చెబుతోందని విమర్శించారు. పార్టీ మారే వారిపై ఆటోమేటిక్ గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్ కు సవరణలు చేస్తామని కాంగ్రెస్ న్యాయపత్రలో హామీ ఇచ్చిందని, కానీ తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం మానేసి, తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పైనే దృష్టి సారించింది అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. విలువలతో కూడిన రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు చేయడం లేదని ఆరోపించారు. బిజెపి తన రాజకీయ స్వార్థం కోసం ప్రాంతీయ పార్టీలపై పెత్తనం చాలా ఇంచే ప్రయత్నం చేస్తుందని, పార్టీలో అంతర్గత చిచ్చును రేపుతోందని విమర్శించారు. శివసేనతోపాటు అనేక పార్టీలను బిజెపి ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. పార్టీలు మారిన వారిపై అనార్హత పిటిషన్ వేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. భారతీయ రాష్ట్ర సమితిని ఎవరు ఏమి చేయలేరని, తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవని నిలబెట్టడంతోపాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకే భారతీయ రాష్ట్ర సమితి ఏర్పాటయిందని, తమ పోరాటం తుది వరకూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక విధంగా, కేంద్రంలో ఒక మాదిరిగా మాట్లాడుతుందని, కాంగ్రెస్ పార్టీ విధానంపై పార్లమెంట్ సెషన్స్ లో తమ రాజ్యసభ ఎంపీలు ప్రస్తావిస్తారని స్పష్టం చేశారు. సమావేశంలో రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి పాల్గొన్నారు.