రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ పాలనలో సాగుకు స్వర్ణ యుగముగా నడిచిందని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైందని విమర్శించారు.
కేటీఆర్
రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ పాలనలో సాగుకు స్వర్ణ యుగముగా నడిచిందని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైందని విమర్శించారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కమాల్ అని, తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే డమాల్ అయిందన్నారు. ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని కేటీఆర్ ఆరోపించారు. ఆగం అయిపోతున్న తెలంగాణ రైతు బతుకుకు ఇది తొలి ప్రమాద సంకేతంగా కేటీఆర్ విమర్శించారు. దశాబ్ద కాలంలోనే దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకంత విధ్వంసం జరిగిందని ప్రశ్నించారు. సంతోషంగా సాగిన సాగులో ఈ స్థాయి సంక్షోభం ఎందుకు వచ్చినట్లు అని ఆరోపించారు. రైతు వ్యవసాయం చేసుకునేందుకు అనువైన పరిస్థితులను కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న వ్యవసాయానికి కరెంటు కట్ చేస్తే, నిన్న రుణమాఫీతో రైతుల సంఖ్య కట్ చేశారన్నారు. ప్రస్తుతం సాగయ్యే భూమి విస్తీర్ణం కట్ అయిందని ఆరోపించారు.
రుణమాఫీ అని మభ్యపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ ఏర్పడిందన్నారు. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని నిలువునా ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ చేతలు సచివాలయం గేటు కూడా దాటడం లేదన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపురం వరకు అన్నదాతలు అత్యంత దయనీయ పరిస్థితి అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదని, రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదని, చెరువులకు నీటిని మళ్లించే తిరుగులేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు బతుకు భరోసానే లేదన్నారు. బురద రాజకీయాలు తప్ప సమయానికి సాగునీళ్ళు ఇచ్చే సోయి అసలే లేకుండా పోయిందని విమర్శించారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదని, క్యూ లైన్ లో పాసుబుక్కులు, చెప్పులు పెట్టి నిరీక్షించాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్ద పగలు, రాత్రి తేడా లేకుండా పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలు రాష్ట్రంలో మిగిలాయన్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గడానికి ఇలా అనేక కారణాలు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కేటీఆర్ పేర్కొన్నారు.