రేవంత్.. దమ్ముందా?

సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా రాష్ట్రంలో 66 శాతం ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటే.. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.

KTR

కేటీఆర్

పార్టీ మారిన 10 మందితో రాజీనామా చేయిస్తావా?

వాళ్లతో మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయించగలవా?

సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్

‘పంచాయతీ’ దెబ్బకు పరిషత్తు ఎన్నికలు వాయిదా: కేటీఆర్

సిరిసిల్ల, డిసెంబర్ 19 (ఈవార్తలు): సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా రాష్ట్రంలో 66 శాతం ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటే.. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అప్పుడు ఎవరు ఎక్కడున్నారనేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో వచ్చేలా లేవని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మాటలు చూస్తే ఇదే అర్థమవుతుందని అన్నారు. కేసీఆర్ ఒక్క మాట మాట్లాడకుండానే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 33 శాతం సీట్లు కొట్టేసరికి రేవంత్ రెడ్డి వెనక్కిపోయిండని ఆరోపించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవడం సులభం కానీ, పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కష్టమని చెప్పుకొచ్చారు. కరీంనగర్ పార్లమెంట్‌లో ఒకాయన ఏం చేయకపోయినా గాలి మాటలు చెప్పి గెలిచిపోతున్నాడని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్‌ 10 సీట్లు గెలవలేదని, కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ 80 గ్రామాల్లో గెలిచిందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కొని సిరిసిల్ల నియోజకవర్గంలోని 117 గ్రామ పంచాయతీలకు గాను 80 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు అఖండ విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.  గ్రామ పంచాయతీ నిధులు ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి వస్తాయని... వాటిని ఆపే హక్కు ఎమ్మెల్యేలకు లేదని, సీఎం రేవంత్‌ రెడ్డికి కూడా ఉండదని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయని.. ఇప్పుడు పగలు, పంచాయితీలు పక్కనబెట్టి కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరానని కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారని.. ఇప్పుడు మాటమార్చి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెబుతున్నారని విమర్శించారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో కడియం, పోచారం ఉన్నారని మండిపడ్డారు. గడ్డిపోచలాంటి పదవి కోసం చూరుకు గబ్బిలాల్లా వేలాడుతున్నారని విమర్శించారు. ఇప్పట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేకుంటే.. జనవరి నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త కమిటీల ఏర్పాటు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. కొత్త రక్తం, పాత తరం అందరిని కలుపుకొని కమిటీలు వేసుకుందామని అన్నారని పేర్కొన్నారు.


క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్