ఆంధ్రప్రదేశ్‌లో వరుస హత్యల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యకర్తలను లక్ష్యం చేసుకొని దాడులు చేస్తున్నారని తెలిపారు.
ఏపీ మాజీ సీఎం జగన్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో వరుస హత్యల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యకర్తలను లక్ష్యం చేసుకొని దాడులు చేస్తున్నారని తెలిపారు. ‘చంపాలనుకొంటే నన్ను చంపండి. నన్ను టార్గెట్ చేసుకోండి. నాపై కోపం ఉంటే నన్ను చంపేయండి. నాకు ఓటువేసిన వారిని, మా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. మీకు ఓటు వేయలేదని మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా పాలనలో ప్రతిపక్షాలపై దాడులు చేయలేదు’ అని ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో జరుగుతున్న హత్యలపై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు ఇండియా కూటమి భేషరతుగా మద్దతు తెలిపింది. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలకు జాతీయ పక్షాల నుంచి స్పందన అందింది. వివిధ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు, ఎంపీలు దీనికి హాజరయ్యారు. వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమివైపు జగన్ అడుగులు వేస్తున్నారన్న సమాచారం అందుతోంది. యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో భేటీ కావటం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. కాగా, ధర్నా ముగించుకొని జగన్ ఏపీకి చేరుకున్నారు.