||ప్రతీకాత్మక చిత్రం ||
జగిత్యాల మునిసిపల్ చైర్ పర్సన్ పదవికి భోగ శ్రావణి రాజీనామా చేశారు. జగిత్యాలలో బుధవారం మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో భోగ శ్రావణి మాట్లాడుతూ.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపుల వల్లే పదవికి రాజీనామా చేస్తున్నట్లు కంటతడి పెట్టారు. ‘దొరల పాలనకు మనం ఎదురెళ్లకుడదు. అలా కాదని ప్రశ్నిస్తే అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బీసీ బిడ్డగా నా ఎదుగుదల చూడలేక అవమానించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని ప్రజలు నాకు కానుకగా ఇస్తే ఈ కానుకను నాకు ఎమ్మెల్యే నరకయాతన అనుభవించేలా చేశాడ’ని ఆమె వ్యాఖ్యానించారు. ‘ఎమ్మెల్యే కూర్చోమంటే కూర్చోవాలి, నిలుచుంటే లేచి నిలిచోవాలి. ఆర నిమిషం లేట్ అయినా అవమానాలతో, మాటలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఎమ్మెల్యే పదవితో పోలిస్తే చైర్మన్ పదవి ఎంత చిన్నదో’ అంటూ హేళన చేశారు.
ఎమ్మెల్యే దొర అనుమతి లేనిదే వార్డు సందర్శించినా నరకం చూడాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే తాను మున్సిపల్ చైర్ పర్సన్ పదవిలో ఉన్నానని, తాను ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యే గారి స్క్రిప్ట్ ని ఫాలో అవ్వాలని తెలిపారు. మాట్లాడే స్వేచ్ఛ కూడా తనకు లేదని వాపోయారు. ’కవితను కలవకూడదు. కేటీఆర్ గురించి ప్రస్తావించకూడదు అని హుకుం జారీ చేస్తారు. ఎన్ని అవమానాలు ఎదురైనా భరించాను కానీ ఇప్పుడు నా కుటుంబం, నా వ్యాపారం జాగ్రత్త అంటూ బెదిరిస్తున్నారు. నా ప్రాణాలకు, నా కుటుంబానికి ఎలాంటి కీడు జరిగినా ఎమ్మెల్యే సంజయ్ కుమారే బాధ్యులు’ అని అన్నారు. తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరుకుంటున్నానని మీడియా సమావేశంలో శ్రావణి పేర్కొన్నారు.