||నామినేషన్ దాఖలు చేస్తున్న పిల్లెల శ్రీకాంత్||
జడ్చర్ల, ఈవార్తలు ప్రతినిధి: జడ్చర్ల నియోజకవర్గంలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) విజయ డంకా మోగిస్తుందని ఆ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లెల శ్రీకాంత్ అన్నారు. శనివారం నాడు ఆయన ఈవార్తలు ప్రతినిధితో మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ప్రతి మండలంలో 50 పడకల సర్కారు దవాఖాన నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అత్యంత చిన్న వయస్సులో అంటే 26 సంవత్సరాలకే తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన పార్టీ అధినేత రామ్ చందర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉందని, సామాజిక తెలంగాణ కోసం బీసీవై పార్టీ కృషి చేస్తుందని వెల్లడించారు. జడ్చర్ల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి బీసీవై పార్టీతోనే సాధ్యమని, నియోజకవర్గ ప్రజలకు బీసీవై పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
తనను గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉచితంగా రూ.2 లక్షల ప్రమాద బీమా పాలసీ వర్తింపజేస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న నిరుద్యోగులకు తమ పార్టీ తరఫున జాబ్ మేళాలు నిర్వహించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జడ్చర్ల నియోజకవర్గంలో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండల కేంద్రంలో 50 పడకల ప్రభుత్వ దవాఖాన నిర్మించి వైద్యం అందజేస్తామని వివరించారు.
ప్రతి మండల కేంద్రంలో రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందజేస్తామని, విద్యార్థినీ విద్యార్థులకు కచ్చితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ ఆర్థిక రంగాలలో అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు పెంచే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ భారత చైతన్య యోజన పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు.