(తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు; Facebook Pic)
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీజేపీ ట్రాప్‌లో పడ్డారా? నరేంద్ర మోదీ, అమిత్ షా అనుకున్నట్లే కేసీఆర్ అడుగులు వేస్తున్నారా? వారిద్దరి రాజకీయ చదరంగంలో ఈయన పావుగా మారారా? అంటే అలాంటి సూచనలే కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆరేళ్లుగా అంతా సాఫీగానే సాగిన కేసీఆర్ పాలన దుబ్బాక ఎన్నికతో ఒక్కసారిగా మారిపోయిందని, ఆ తర్వాత కేసీఆర్ నిర్ణయాలు, చేసే పనుల్లో మెల్లిమెల్లిగా మార్పులు కనిపించాయని చెప్తున్నారు. ఎనిమిదేళ్లుగా గుర్తుకు రాని సెప్టెంబర్ 17.. ఒక్కసారిగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలుగా మారిపోయింది. దీనికి అసలు కారణం బీజేపీయేనని విశ్లేషకులు కుండబద్ధలు కొడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన సీట్లు బీజేపీకి కొండంత బలాన్నిచ్చాయి. ఆ తర్వాత హుజూరాబాద్ ఫలితం ఆ పార్టీని తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. దీంతో కేంద్ర అధినాయకత్వం నుంచి, కింది స్థాయి కార్యకర్త దాకా అంతా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. చురకత్తి లాంటి బండి సంజయ్ ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. ఎంతలా అంటే.. బండి సంజయ్ ఏదైనా చేయగలడు, 2023లో రాష్ట్రంలో అధికారాన్నీ కట్టబెట్టగలడు అని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తున్నది. వాస్తవానికి ఒత్తిడిలోనే గొప్ప రాజకీయ చాణక్యంతో, చాతుర్యంతో గెలుపును ముద్దాడే తత్వం కేసీఆర్‌ది. కానీ, మునుపటి వాడీవేడి కేసీఆర్‌లో లేవని రాజకీయ పండితులు చెప్తున్నారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్ణయమే పెద్ద తప్పు అని, బీజేపీయే ఆయనను ఇందులోకి లాగిందని అంటున్నారు. తెలంగాణ విమోచన దినం నిర్వహించి తెలంగాణ ప్రజల గుండె లోతుల్లో ఇంకా సజీవంగా ఉన్న సెంటిమెంట్‌ను క్యాచ్ చేసుకోవాలనుకుంది. ఇదే కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో విమోచన దినాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. విమోచన దినం అంటే.. మజ్లిస్‌కు కోపం, హైదరాబాద్‌లో పట్టు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే.. భారత్‌లో విలీనమైన సందర్భం అని చెప్తూ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు.
కానీ, సగటు తెలంగాణ వ్యక్తి.. సెప్టెంబర్ 17ను విమోచన దినంగానే చూస్తున్నారు. భారతలో కలవడానికంటే ముందు నిజాం క్రూరత్వం నుంచి విముక్తి లభించిందన్న ఆనందమే వారికి ఎక్కువ. రజాకార్లు, పెత్తందార్ల దోపిడీకి కాస్త ఉపశమనం లభించిందన్న సంతృప్తి వాళ్లది. అందుకే ఈ రోజును తెలంగాణ విమోచన దినంగానే చూస్తున్నారు. ఇది కాదనలేని వాస్తవం. దీనికి భిన్నంగా కేసీఆర్ సమైక్యతా రాగం ఎత్తుకోవడం ప్రజలకు రుచించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా తెలంగాణకు మరో తేది.. అధికారికం అయ్యిందని, ఇదైనా సంతోషమే అని ప్రజలు భావిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ‘ఈ క్రెడిట్ బీజేపీదే’ అని సగటు తెలంగాణ అభిమాని అనుకుంటున్నాడని పేర్కొంటున్నారు.
ఇక్కడ బీజేపీ క్రెడిట్ కొట్టేసింది.. అదే సమయంలో కేసీఆర్‌ను తాము చూపిన దారిలో నడిపించిందని రాజకీయ పండితులు తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ తీసుకునే నిర్ణయాల్లో బీజేపీ ఎత్తుగడల ఫలితమే కానవస్తుందని వెల్లడించారు. తనను, పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ ఈ ఊబిలో పడక తప్పదని వివరించారు. కానీ.. కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చగల సమర్థుడు. తన మెడ తెగుతుందని తెలిస్తే.. దక్షిణాది రాగం ఎత్తుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.