||కాంగ్రెస్‌లోకి పాడి కౌశిక్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చిన హుజూరాబాద్ ఎమ్మెల్యే?||
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు, తిరిగి కాంగ్రెస్ గూటికే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి బొకే ఇచ్చినట్లు ఒక ఫొటో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ప్రస్తుతం ఆయనతో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి హాజరు కాకపోవడమే అందుకు కారణమని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ప్రజలు తప్పుడు వార్తలతో మోసపోవద్దని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
కాగా, పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిసిన ఫొటోపై స్పందించాలని కోరగా.. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పటి ఫొటో అని వివరణ ఇచ్చారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తాను జీవితాంతం బీఆర్ఎస్‌లోనే ఉంటానని, కేసీఆర్‌తోనే కలిసి నడుస్తానని తేల్చి చెప్పారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేనేలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఫొటోలతో తన ప్రతిష్ఠ దిగజార్చాలని అనుకోవడంపై ఆయన మండిపడ్డారు.