(ప్రతీకాత్మక చిత్రం)
ఈవార్తలు, ఈముచ్చట: మరో ఏడాదిన్నరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత మరో ఆరు నెలలకు ఏపీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో దేశంలోని అన్ని పార్టీలు అధికారమే పరమావధిగా పావులు కదుపుతున్నాయి. ఉచితాలు వద్దంటూ కొన్ని పార్టీలు, అవి సంక్షేమ పథకాలు అంటూ ఇంకొన్ని పార్టీలు చెప్తున్నాయి. ఏదేమైనా అదంతా ప్రజల డబ్బే. ఇచ్చేది ప్రజలకే. అయినా, మేమిస్తున్నాం, మేం వద్దంటున్నాం అని వాదించుకుంటున్నాయి. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు సంక్షేమం పేరుతో భారీగా అప్పులు తెస్తున్నాయి. ఇదంతా ప్రజలను బాగు చేసేందుకేనని అంటున్నాయి. కానీ, అదంతా మళ్లీ ప్రజలపైనే పడే అప్పు భారం అని మాత్రం ఎక్కడా చెప్పవు. చెప్తే పరిస్థితి మరోలా ఉంటుంది కదా. అంటే.. అధికారం చేతికి అందదు కదా. అటు.. కేంద్రం కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోంది. ఈ నిర్ణయం.. ఎంతో మంది ఉద్యోగులకు నీడ లేకుండా చేస్తోందన్నది విశ్లేషకుల వాదన.
ఒక పార్టీ, ఒక ప్రభుత్వం అని చెప్పలేం. దేశంలోని దాదాపు అన్ని పార్టీలు.. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. కానీ, ఇక్కడ మరిచింది ఏంటంటే.. ప్రజలకు ఏం అవసరం? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాష్ట్రాలు, దేశం పరిస్థితి ఏంటి? భవిష్యత్తు ఎలా ఉంటుంది? అని మాత్రం ఏ పార్టీ ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. దేశాన్ని నేనే ఏలాలి అని కొందరు, రాష్ట్రాల్లో మాదే పెత్తనం అని ఇంకొందరు వాదించుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచిస్తున్న జాడలు లేవు. దేశ రాజకీయాల్లో ముద్ర వేయాలని ఆరాట పడుతున్నవారు మరికొందరు. వీళ్లకు రాజకీయాలే కావాలి. అధికారమే దక్కాలి. కానీ, ప్రజలారా! ఆలోచించాల్సింది మనమే. ఓటు వేయాల్సింది మనమే. అంటే.. రాబోయే ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సింది మనమే. జాగ్రత్త సుమా.
ఇక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విషయానికి వస్తే.. మరుసటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీలు పనిచేస్తున్నాయి. తెలంగాణలో చూస్తే, మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. చిన్న పార్టీలు కూడా ఎన్నికల సమయానికి రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక్కడంతా ఇప్పుడు మత రాజకీయాలే నడుస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో చూస్తే.. ఇప్పుడే ఎలక్షన్ హీట్ దంచేస్తోంది. ఇక్కడ జగన్ లీడర్‌షిప్‌లోని వైసీపీ పాలిస్తోంది. ఎలాగైనా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. అటు.. టీడీపీ, జనసేన తమ ఉనికి చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో ఇప్పుడు రాజకీయమంతా కులం చుట్టే తిరుగుతోంది. ఆ కులమే వచ్చే ఎన్నికలను ప్రభావితం చేస్తుందని కచ్చితంగా చెప్పవచ్చని రాజకీయ పండితులు చెప్తున్నారు.
తెలంగాణలో మతం, ఆంధ్రప్రదేశ్లో కులం.. ఇలా రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. కానీ, ప్రజల జీవితాలు, వారి ప్రమాణాలు, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఉద్యోగ కల్పనపై ఏ పార్టీ మాట్లాడకపోవడమే విడ్డూరంగా ఉంది. వాటి గురించి మాట్లాడే పార్టీలు.. ఆ పని మాత్రం చేయడం లేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలపై ఓ అవగాహనకు వచ్చిన ప్రజలు.. ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి అధికారం ఇస్తే బాగుంటుందని ఫిక్సై పోయారని, ఎన్నికలు జరగడమే లేట్ అని విశ్లేషకులు చెప్తున్నారు. చూడాలి మరి ఏ పార్టీ గెలుస్తుందో. కాదు.. కాదు.. ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తారో!