||ప్రతీకాత్మక చిత్రం||
మన దేశం పేరు మారబోతోందా? ఇప్పటికే దీనిపై కేంద్రం అన్ని చర్యలు ప్రారంభించిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆ దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని ప్రకటించనున్నట్లు తెలస్తోంది. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి జరిగే జీ 20 సమావేశాల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనూ భారత్‌గా మార్చుతూ ప్రత్యేక బిల్లు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే వ్యతిరేక కూటమి ఇండియాగా పేరు పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. కాగా, రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఇందుకు సంకేతాలు అందాయి. జీ20 సదస్సులో పాల్గొనే నాయకులను సెప్టెంబర్ 9న విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికను విడుదల చేసింది. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రింట్ చేసింది. మరోవైపు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా.. తన ట్వి్ట్టర్ అకౌంట్‌లో రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు.
భారత్, ఇండియా అన్న పేర్లు ఎలా వచ్చాయంటే
భారత్ అన్న పేరు భరతుడి నుంచి వచ్చిందని చెప్తుంటారు. దేశాన్ని పాలించిన భరతుడి పేరు మీదుగా ఈ పేరు వచ్చిందని అంటుంటారు. దుష్యంతుడు, శకుంతలకు పుట్టిన కుమారుడి పేరే భరతుడు. ఆయన పేరుమీదుగానే ఈ పేరు వచ్చిందని మహాభారతం చెప్తోంది. ఇక, ఇండియా అన్న పేరు ఆంగ్లేయుల వల్ల వచ్చింది. సింధూ నదిని ఆంగ్లేయులు ఇండస్ అని పిలిచారు. కాలక్రమేనా వారు ఇండియా అని పిలవడం మొదలు పెట్టారు. అలా ఆ పేరే ప్రాచుర్యం పొందింది. రాజ్యాంగంలోనూ ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంటుంది.
పేరు మార్పుకు సవరణలు చేయాలా?
భారత రాజ్యాంగంలోని పార్ట్-1లోని ఆర్టికల్-1లో ఇప్పటికే ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంది. దానికి తగ్గట్టు సవరణలు అవసరం లేదని న్యాయనిపుణులు చెప్తున్నారు. దేశాన్ని ఇక నుంచి భారత్ అని పిలుస్తామని పార్లమెంట్‌ల తీర్మానం చేస్తే సరిపోతుందని అంటున్నారు. కొందరేమో సవరణ చేయాల్సిందేనని పేర్కొంటున్నారు. గతంలోనూ ఇండియా పేరు మార్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఇప్పటికే ఎక్కువ మంది భారత్ అని పిలుస్తున్నాయని, ఈ అంశంలో తాము కలగజేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే ఈ పిటిషన్‌ను కేంద్రానికి సమర్పించాలని సూచించింది.
భారత్‌గా మారితే ఏమేం మారుతాయంటే..
ఇండియా పేరు భారత్‌గా మారితే అనేక చట్టాల్లో మార్పులు చేయాలి. ఆలిండియా సర్వీసెస్‌ను భారత్‌గా మార్చాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను గవర్నమెంట్ ఆఫ్ భారత్‌గా మార్చాలి. ఇండియన్ ఆర్మీ, ఐఐటీ, ఐఐఎంలు తదితర పేర్లు మారే అవకాశం ఉంది.