రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే వారికి ప్రోత్సాహకాలను అందిస్తామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ నుంచి వెళ్లి వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు తిరిగివచ్చి తమ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించాలని కోరారు. ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు.
చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి కొండపల్లి
రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే వారికి ప్రోత్సాహకాలను అందిస్తామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ నుంచి వెళ్లి వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు తిరిగివచ్చి తమ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించాలని కోరారు. ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు. ప్రపంచ దేశాల అవసరాలపై అధ్యయనం చేసి ఆ తరహా ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లు నెలకొల్పాలని పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. ఉన్నత చదువులు పూర్తి చేసుకునే యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనను మార్చుకొని రాష్ట్రంలోనే చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి తమతోపాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే యువ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పే పారిశ్రామికవేత్తలను తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న వనరులను బట్టి వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రోడక్ట్ అనే కార్యక్రమాన్ని చేపట్టి అందుకు అనుకూలమైన ఎం.ఎస్.ఎం.ఈ యూనిట్లు నెలకొల్పేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ నిర్వాహకుల సమస్యల పరిష్కారం కోసం ప్రతినెల జిల్లా స్థాయిలో, ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
పీఎంఈజీపి ఎంఎస్ఎంఈ పథకాల కింద రూ.7.29 కోట్ల పెట్టుబడులతో కొత్తగా పరిశ్రమలు ప్రారంభించనున్న 38 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రావు అనుమతి పత్రాలు అందించారు. కొత్తగా ఎంఎస్ఎమ్ఈ యూనిట్లు ప్రారంభిస్తున్న మరో 12 మంది పారిశ్రామికవేత్తలకు వివిధ బ్యాంకులు మంజూరు చేసిన రూ.9.39 కోట్ల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. యువత ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రవాస ఆంధ్రులు కూడా ఇక్కడ మంచి అవకాశాలను పొందవచ్చు అన్నారు. ప్రవాసులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.