సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే చిత్తశుద్ధి అవసరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి అదే చిత్తశుద్ధితో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కానీ, రాష్ట్రంలో సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధితో పథకాలను అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అమ్మకు వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి రూ.15000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఒకరికి మాత్రమే అందిస్తామంటూ జీవో ఎలా జారీ చేశారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల
సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే చిత్తశుద్ధి అవసరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి అదే చిత్తశుద్ధితో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కానీ, రాష్ట్రంలో సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధితో పథకాలను అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అమ్మకు వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి రూ.15000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఒకరికి మాత్రమే అందిస్తామంటూ జీవో ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.15000 చొప్పున ఇస్తామంటూ ఊదరగొట్టారన్నారు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రతి తల్లికి 15 వేలా.? ప్రతి బిడ్డకు 15 వేలా..? అన్నది స్పష్టత ఇవ్వాలని కోరారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే విధమైన వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పారని, తల్లికి మాత్రమే రూ.15000 ఇచ్చారన్నారు. ఆ ఆ విషయాన్ని మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షిలో చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తూ కథనం రాశారన్నారు. జగన్మోహన్ రెడ్డి తరఫున క్యాంపైన్ చేసిన తనతో కూడా అప్పట్లో ఈ పథకం గురించి అబద్ధం చెప్పించారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ పథకంలో భాగంగా ప్రతి బిడ్డకు అమలు చేస్తారని భావించి బైబై బాబు క్యాంపైన్ లో పాల్గొన్నానన్నారు.
జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద ఒక బిడ్డకు మాత్రమే అందించారన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఒక బిడ్డకే ఇస్తారనే విధంగా పరిస్థితులు ఉన్నాయనీ, దీనికి అనుగుణంగానే జీవో విడుదల అయిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు. ఒకరు ప్రైవేటీకరణ చేయమని చెబుతుంటే మరొకరు నష్టాల్లో ఉందని చెబుతున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఏపీలోని ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు. విశాఖ స్టీల్ కు ఇప్పటి వరకు కాపిటివ్ మైన్ లేకుండా పోయిందన్నారు. క్యాపిటివ్ మైన్ ఉండుంటే స్టీల్ ప్లాంట్ కు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. వైయస్సార్ 75 వ జయంతిని ఎంతో గొప్పగా చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు నామమాత్రంగా చేశారని ప్రశ్నించారు. ఇడుపులపాయలో ఐదు నిమిషాలు కూర్చుని వెళ్లిపోయారన్నారు. సిద్ధం తరహా సభల్లో ఒకటి కూడా రాజశేఖర్ రెడ్డి జయంతికి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తన తండ్రి కాబట్టే తాము పెద్ద సభను నిర్వహించామన్నారు. పెద్ద పెద్ద నాయకులను పిలిచామన్నారు. వీళ్ళా రాజశేఖర్ రెడ్డి వారసులు.? అని జగన్ మోహన్ రెడ్డిని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి బిజెపికి తోక పార్టీగా మారారని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత కల్పించే పథకాన్ని వేగంగా అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేశారని, ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటుతున్న ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.