Hydra started demolition of houses in old city hyderabad
AV Ranganath
మూసీ సుందరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల కూల్చివేతలను ప్రారంభించింది. ఈ కూల్చివేతలను అధికారులు మొదట ఓల్డ్‌సిటీనుంచే మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయమే చాదర్‌ఘాట్ లోని మూసా నగర్, రసూల్‌పురా, శంకర్‌నగర్ బస్తీకి బుల్డోజర్లతో అధికారులు చేరుకున్నారు. ఆర్‌బీ-ఎక్స్ (రివర్ బెడ్-ఎక్స్‌ట్రీం) అని రాసి, ఖాళీ చేసిన ఇండ్లను కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు కలుగకుండా ముందే అక్కడ భారీస్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు. ఇక్కడ దాదాపు 140 ఇండ్లు ఖాళీ కాగా, అధికారులు వాటి కూల్చివేతలు ప్రారంభించారు. ఇక్కడ ఎవరైతే ఇండ్లు ఖాళీ చేశారో.. వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇంతవరకు కేటాయించలేదని బాధితులు అంటున్నారు.
ఓ వైపు ఆందోళనలు.. మరోవైపు కూల్చివేతలు
మూసీ ప్రక్షాళనలో భాగంగా ఆ నదిలోని ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నివాసాలను అధికారులు గుర్తించారు. మొత్తం 16వేలు ఇండ్లు, గుడిసెలు ఇందులో ఉన్నట్టు తేల్చారు. ఆ ఇండ్లపై ఆర్‌బీ-ఎక్స్ అని బిగ్ లెటర్స్‌తో పెయింటింగ్ వేశారు. ఈ నేపథ్యంలో మూసీ నివాసితులు అధికారులపై తిరగబడ్డారు. తమ ఇండ్లను కూల్చొద్దంటూ ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్ రూంలు కేటాయించి, అక్కడికి తరలిస్తామని ప్రభుత్వం సముదాయించే ప్రయత్నం చేసినా కొందరు వెనక్కి తగ్గడం లేదు. వివరాలు నమోదు చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. అయినా.. ప్రభుత్వం దీనిపై వెనకడుగు వేయలేదు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెడ్‌మార్క్ చేసిన ఇండ్ల కూల్చివేతలను ప్రారంభించింది. అదే సమయంలో నివాసితులు ఆందోళన చేస్తున్న మూసీ రివర్‌బెడ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ అధికారులు రెడ్‌మార్క్ చేస్తున్నారు. ఆ ఇండ్లను ఖాళీ చేసిన వెంటనే కూల్చేస్తామని అధికారులు చెబుతున్నారు