||ముద్దగౌని రామ్మోహన్ గౌడ్||
(ఎల్బీనగర్, ఈవార్తలు, దేవులపల్లి రంగారావు)
ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ఆయన భార్య ప్రసన్న తిరిగి సొంతగూడు బీఆర్ఎస్‌లో చేరారు. బుధవారం నాడు రాష్ట్ర, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు.. ముద్దుగౌని రామ్మోహన్ గౌడ్ ఇంటికి వెళ్లి రామ్మోహన్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించడంతో ఆయన సుముఖత వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కండువా కప్పి రామ్మోహన్ గౌడ్, ఆయన భార్య ప్రసన్నను హరీశ్ పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని బలోపేతం చేయడంలో రామ్మోహన్ గౌడ్ కృషి మరువలేనిదని అన్నారు. గతంలో పార్టీ టికెట్ ఇస్తే స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారని, భవిష్యత్తులో రామ్మోహన్ గౌడ్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆయనకు ఉన్నత పదవి ఇచ్చేందుకు భారత రాష్ట్ర సమితి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని గెలిపించి అధికారంలోకి తెచ్చేందుకు ఎల్బీనగర్ పరిధిలో రామ్మోహన్ గౌడ్ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ తనకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ లోకి వెళితే, ఆ పార్టీ మొండి చేయి చూపించిందని చెప్పారు. తనకు భారత రాష్ట్ర సమితిలోనే న్యాయం జరుగుతుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మళ్లీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.