కర్ణుడు చావుకి వంద.. వైసిపి ఓటమికి ఎన్నో కారణాలు..!

కర్ణుడు చావుకి వంద కారణాలు అంటారు.. అలాగే రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవానికి ఎన్నో కారణాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు, రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Jagan Mohan Reddy

జగన్ మోహన్ రెడ్డి


కర్ణుడు చావుకి వంద కారణాలు అంటారు.. అలాగే రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవానికి ఎన్నో కారణాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు, రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఐదేళ్లు అధికారాన్ని చలాయించిన తర్వాత అత్యంత ఘోరంగా ఓటమిని చవి చూడడం పట్ల ఆ పార్టీ నాయకులతోపాటు శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పదికిపైగా శాతం ఓట్ల తేడాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసింది. దీనికి అనేక కారణాలు ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలు, అధికారులు చేసిన తప్పిదాలు కారణంగానే ఓటమి పాలైనట్లు చెబుతున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోనే ఉంటున్నారు అన్న విమర్శలు, బటన్ నొక్కుడు తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి లేదన్న ఆరోపణలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, రాష్ట్రంలో పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల భర్తీ సాధ్యం కాకపోవడం, నాసిరకం మద్యం విక్రయాలు, ఇసుక విధానం, క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తలను, కింది స్థాయి నాయకులను పట్టించుకోకపోవడం, అన్నింటి కంటే ముఖ్యమైనది ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత, సిపిఎస్ అమలు చేయకపోవడం, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించడం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం, మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడడం వంటి అనేక అంశాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పతనానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. 151 స్థానాలు సాధించిన ఒక పార్టీ ఐదేళ్లు గడవక ముందే ఈ స్థాయిలో పరాభవాన్ని మూటగట్టుకోవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా పలువురు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులు ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ చుట్టూ చేరిన కొందరు నాయకులు, అధికారులు కోటరీగా ఏర్పడి క్షేత్ర స్థాయిలో వాస్తవాలను జగన్ కు తెలియకుండా చేశారని, అదే ప్రస్తుతం ఆ పార్టీ ఘోర పరాభవానికి కారణమైందని చెబుతున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తే చాలు అన్న భావన జగన్మోహన్ రెడ్డిని ఘోరంగా దెబ్బతీసింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రజలకు సంక్షేమంతోపాటు అభివృద్ధిని కోరుకుంటారన్న కనీస విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తించలేకపోయారని, ఆ ఆలోచన తాజా ఫలితాలకు నిదర్శనమని రాజకీయ పండితులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్