వాతావరణంలో వచ్చిన మార్పులు, అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం, సోమవారంతోపాటు మంగళవారం కూడా అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించంది. తెలంగాణలో ఆదివారం భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారంతోపాటు సోమవారం కూడా రాష్ట్రంలోనే అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.
హైదారాబాద్ లో కురుస్తున్న వర్షాలు
వాతావరణంలో వచ్చిన మార్పులు, అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం, సోమవారంతోపాటు మంగళవారం కూడా అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించంది. తెలంగాణలో ఆదివారం భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారంతోపాటు సోమవారం కూడా రాష్ట్రంలోనే అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం పశ్చిమ - వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారి ఆదివారం ఉదయం 5.30 గంటలకు అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండనుంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్యం దిశగా కదిలి ఉత్తర ఆంధ్ర తీరం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో విశాఖపట్నం మరియు గోపాల్ పూర్ మధ్య కలింగపట్నానికి సమీపంలో శనివారం అర్ధరాత్రి తీరం దాటుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే రుతుపవన ద్రోని ప్రభావంతో ఆదివారం, సోమవారం, తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో చాలాచోట్ల ఈదురు గాలులు వీస్తున్నాయి. మంగళవారం 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాదులో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలోనే వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు ఆరు నుంచి పది కిలోమీటర్ల వేగంతో ఉంటుందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఎలా ఉండనుంది
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సాకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి శనివారం ఉదయానికి వాయుగుండం గా మారింది. గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో కదులుతూ ఉత్తరాంధ్ర తీరం దిశగా పయనిస్తోంది. సాయంత్రానికి విశాఖపట్నంకి తూర్పు ఈశాన్యంగా 90 కిలో మీటర్లు, కళింగపట్నానికి 30 కిలోమీటర్లు దక్షిణ నైరుతి కేంద్రంగా కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్యంగా పయనించి శనివారం అర్ధరాత్రి తర్వాత విశాఖపట్నం - గోపాలపూర్ మధ్య కలింగ పట్టణానికి చేరుగా తీరం దాటుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఆదివారం ఉదయం వరకు కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, పల్నాడు జిల్లాలో కుంభవృష్టిగా, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ, కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో అన్ని ఓడరేవుల్లో మూడో నెంబర్ భద్రత సూచిక ఎగరవేశారు. ఆదివారం ఉదయం నుంచి కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.