పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. పటాన్ చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేంతవరకు నిద్రపోమని హరీష్ రావు స్పష్టం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. పటాన్ చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేంతవరకు నిద్రపోమని హరీష్ రావు స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా అన్ని అనుభవించిన ఎంతో మంది నాయకులు ఇప్పుడు అధికారాన్ని కోల్పోగానే పార్టీ మారుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాటం సాగిస్తామని వెల్లడించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుందని, అప్పుడు తమ బలాన్ని చూపించాలని కార్యకర్తలకు ఆదేశించారు. 2001లో తెలంగాణ ఉద్యమం పిడికెడు మందితో ప్రారంభమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తించారు. కేసీఆర్ ఒక్కడే 14 ఏళ్ళు పోరాడి, రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపించారన్నారు.
బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో తమదే అధికారం అంటూ కార్యకర్తలకు భరోసాను కల్పించే ప్రయత్నం చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉండగా ఎంతో మంది పార్టీ నుంచి లబ్ధి పొందారని, వారంతా పార్టీ కష్టకాలంలో ఉండగా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన మహిపాల్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ తల్లిలా అక్కున చేర్చుకొందన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేని చేసిందని విషయాన్ని మహిపాల్ రెడ్డి మర్చిపోయాడు అని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ ఏమి తక్కువ చేసిందని పార్టీ మారారని, ఫిరాయింపులకు పాల్పడేందుకు ఆయనకు మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మహిపాల్ రెడ్డి పోయిన గుండె ధైర్యం కోల్పోవద్దని కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి చెప్పారని ఇప్పుడు ఆయనే కండువా కప్పుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీలో కోతలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తామని జీవోలో ఉందని, నోటితో మాత్రం రేషన్ కార్డుతో సంబంధం లేదని అంటున్నారన్నారు. నోటితో వచ్చిన మాటని జీవోలో పెట్టినప్పుడే తాము నమ్ముతామని పునరుద్గాటించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఐదేళ్లకు మించి అధికారంలో లేదని, ఆరు నూరైనా మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కొద్దిరోజులు ఆగితే కాంగ్రెస్ వాళ్లు గ్రామాల్లో తిరగని పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో బస్సు తప్ప మిగిలినవి అన్నీ తుస్సేనన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు మంచి రోజులు వస్తాయని హరీష్ రావు వెల్లడించారు. ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీలు మారారని, పార్టీ మాత్రం బలంగానే ఉందన్నారు.