ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరుగాంచిన చేగొండి హరి రామజోగయ్య తాజాగా విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఆయన విడుదల చేసిన లేఖలో పేర్కొన్న అంశాలు కూటమి నేతల్లో చిచ్చుకు కారణమవుతున్నాయా..? అన్న ప్రశ్నలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా హరి రామ జోగయ్య ఒక లేఖ విడుదల చేశారు.
చేగొండి హరి రామజోగయ్య
ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరుగాంచిన చేగొండి హరి రామజోగయ్య తాజాగా విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఆయన విడుదల చేసిన లేఖలో పేర్కొన్న అంశాలు కూటమి నేతల్లో చిచ్చుకు కారణమవుతున్నాయా..? అన్న ప్రశ్నలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా హరి రామ జోగయ్య ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోంది అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలు పేరుతో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను మాత్రమే ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన హామీ ఇచ్చిన షణ్ముఖ వ్యూహం పథకాలను కూడా వెంటనే అమలు చేయాల్సిందిగా ఆయన కోరారు. జనసేన షణ్ముఖ వ్యూహం హామీల్లో ఒకటైన యువకులకు 10 లక్షల వరకు రాయితీ ఇచ్చే సౌభాగ్య పథకం బృహత్తరమైనదని, దీన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. సంపద చేకూర్చే ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తోందని, టిడిపి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని, జనసేన ఇచ్చిన హామీలను మాత్రం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. హరిరామ జోగయ్య విడుదల చేసిన ఈ లేఖ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే జనసేన నాయకులు, కార్యకర్తల్లో ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ, బహిరంగంగా ఎవరు వ్యాఖ్యానించలేని పరిస్థితి. ప్రస్తుతం హరి రామజోగయ్య విడుదల చేసిన ఈ లేఖ విడుదల చేసిన తర్వాత మరింత మంది జనసేన నాయకులు ఈ వ్యవహారంపై మాట్లాడే అవకాశాలున్నాయన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతోంది. కూటమిలో అభిప్రాయ భేదాలు రాకుండా ఉండాలంటే జనసేన ఇచ్చిన కీలక హామీలను కూడా అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని పలువురు కోరుతున్నారు. చూడాలి దీనిపై టిడిపి నాయకులు ఎలా స్పందిస్తారో.