||గవర్నర్ తమిళిసైకి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలుకుతున్న సీఎం కేసీఆర్ Photo: Instagram||
కొత్త సచివాలయం ప్రారంభమయ్యాక తొలిసారి గవర్నర్ తమిళిసౌ సౌందర్‌రాజన్ నేడు సెక్రటేరియట్‌ను సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన నూతన గుడి, మసీదు, చర్చి ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. గురువారం రాజ్‌భవన్‌లో భేటీ సందర్భంగా ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్‌ను సీఎం కోరారు. అందుకు గవర్నర్ ఓకే చెప్పారు. ఈ మేరకు ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానంతరం.. గవర్నర్‌ను స్వయంగా తీసుకొని వెళ్లి సచివాలయాన్ని చూపించారు. ఒక్కో ఫ్లోర్ గురించి వివరిస్తూ, ప్రాంగణం అంతా కలియదిరిగారు. తన చాంబర్‌కు తీసుకొని వెళ్లి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గవర్నర్‌కు కుంకుమ పెట్టి సంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. అనంతరం గవర్నర్‌కు సీఎం తేనీటి ఈవిందు ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సచివాలయ నిర్మాణం గొప్పగా ఉన్నదని కొనియాడారు. కాసేపు ఆహ్లాదకర వాతావరణంలో ఇష్టాగోష్టి జరిపారు. సచివాలయ సందర్శన అనంతరం సీఎం కేసీఆరే స్వయంగా ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి గవర్నర్‌కు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ప్రణాళికాసంఘం వైస్‌చైర్మన్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.