Kamareddy Master Plan : కామారెడ్డిలో పరిస్థితులు ఉద్రిక్తం.. అసలేమిటీ మాస్టర్ ప్లాన్ అంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


|| కామారెడ్డి ||కామారెడ్డి: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ వివాదం రాజుకున్నది. మాస్టర్ ప్లాన్‌ను వెంటనే రద్దు చేయాలని రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. రైతుల పొట్ట కొట్టేలా ఈ ప్లాన్ ఉందని ఆరోపించారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ నిర్ణయంతో యువ రైతు రాములు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నదాతలు.. కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కలెక్టరేట్ ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ర్యాలీలో దుబ్బాక ఎమ్మెల్యే (బీజేపీ) రఘునందన్ రావు, బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి  మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇన్‌చార్జి సుభాశ్ రెడ్డి పాల్గొన్నారు. అటు.. రాములు మృతికి నిరసనగా అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది. సర్పంచ్ సహా 9 మంది వార్డు మెంబర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్‌ను ఉన్నఫలంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


రైతుల ఆందోళన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదానేనని, రైతుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అభ్యంతరాలు ఉంటే ముసాయిదాలో మార్పులు చేస్తామని వెల్లడించారు. రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదని, తమది రైతు ప్రభుత్వం అని వివరించారు. మాస్టర్ ప్లాన్ ప్రజలకు అనుకూలంగా ఉండాలి గానీ, వ్యతిరేకంగా ఉండొద్దని కామారెడ్డి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.


మాస్టర్ ప్లాన్ ఇదీ..

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పేరుతో.. ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 8 గ్రామాలను మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. ఈ గ్రామాల్లోని రైతుల భూములను సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్‌కు కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన భూమి పోతుందన్న భయంతో బుధవారం రాములు అనే యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాస్టర్ ప్లాన్ వల్ల దాదాపు 500 ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్‌కు పోతుందని సమాచారం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్