రుషికొండ భవనాలపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

వైసీపీ పాలనలో పర్యాటకశాఖ మంత్రిగా పనిచేసిన రోజా సెల్వమణి ఈ భవనాలపై వస్తున్న విమర్శలపై స్పందించారు. రుషికొండలో నిర్మించిన టూరిజం బిల్డింగ్ ఒక్కటే టీడీపీ వాళ్లకు కనిపిస్తోందని విమర్శించారు.

roja selvamani

జగన్‌తో రోజా

విజయవాడ, ఈవార్తలు : విశాఖలోని రుషికొండ భవనాలే ఇప్పుడు హాట్ టాపిక్. వైసీపీ హయాంలో సీఎం నివాసం కోసం నిర్మించినట్లు చెప్తున్న ఈ భవనాల్లో ఉండే అత్యాధునిక వసతులపై అంతా మక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ పాలనలో పర్యాటకశాఖ మంత్రిగా పనిచేసిన రోజా సెల్వమణి ఈ భవనాలపై వస్తున్న విమర్శలపై స్పందించారు. రుషికొండలో నిర్మించిన టూరిజం బిల్డింగ్ ఒక్కటే టీడీపీ వాళ్లకు కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు, రాష్ట్రంలో  నిర్మించిన పోర్టులు, రాష్ట్రంలో నిర్మించిన సచివాలయాలు, రాష్ట్రంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలు కూడా వెళ్లి చూడాలని చురక అంటించారు. పచ్చకామెర్లు వచ్చినవాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని.. స్కాంలు చేయటం అలవాటు ఉన్న చంద్రబాబుకు కూడా అన్నీ స్కాంలలాగే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రుషికొండ భవనాలపై టీడీపీ నేతలవి ఏడుపులేనని మండిపడ్డారు. ఆ పర్యాటక భవనంలో ప్రపంచస్థాయి నేతలు వస్తారని, వారికోసం ఆ స్థాయిలో ఫర్నిచర్ ఏర్పాటు చేయడం అవసరమేనని తెలిపారు.

టీడీపీ నేతల విజయం ఏమిటనేది అర్థం అవుతోందని చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతోందని, పరోక్షంగా ఈవీఎంలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గుమ్మడి కాయ దొంగ అంటే టీడీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని వ్యాఖ్యానించారు. 40 శాతం ఓట్లతో రేవంత్ సీఎం అయ్యారని, 40 శాతం ఓట్లు వచ్చిన మోదీ ప్రధాని అయ్యారని, అదే..40 శాతం ఓట్లు వచ్చిన జగన్‌కు 11 సీట్లే ఏంటని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ప్రజలను జగన్ సొంత కుటుంబంలా చూసుకున్నారని వెల్లడించారు. ఏపీ ప్రజలు వైసీపీకి 40 శాతం ఓట్ షేర్ అందించారని, మళ్లీ పార్టీ భవిష్యత్తు కార్యాచరణతో ప్రజల్లోకి వస్తామని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్