బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్.. బీసీ నాయకుడివైపే బీజేపీ అధిష్టానం మొగ్గు!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలిసింది. రెండు, మూడు రోజుల్లోనే ఆయన పేరును ప్రకటించనున్నట్లు సమాచారం.

etela rajendhar

ఈటల రాజేందర్

హైదరాబాద్, ఈవార్తలు : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలిసింది. రెండు, మూడు రోజుల్లోనే ఆయన పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి ఈటల బాధ్యతలు తీసుకోబోతున్నారని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదివరకే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ ఉన్నారని కిషన్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి ఈటల రాజేందర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. పార్టీ పదవి చేపట్టడానికి ఆరెస్సెస్ బ్యాగ్రౌండ్ అవసరం లేదని, రెండు సార్లు బీజేపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నా, పార్టీ టికెట్‌పై రెండు సార్లు పోటీ చేసినా సరిపోతుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు ఆయన మాటల్లో తెలిసిపోయింది.

అటు ఈటల వర్గం కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల పేరు ఖరారైనట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అదే సమయంలో రియల్ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల చేయిచేసుకోవడం కూడా సంచలనంగా మారింది. వాస్తవానికి ఈటల అంత త్వరగా ఆవేశ పడే వ్యక్తి కాదు. కానీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందన్న జోష్‌లో ఆయన ఆ విధంగా స్పందించి ఉండవచ్చని పలువురు తమదైన శైలిలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇక.. తాను అధ్యక్ష పదవి పోటీలో లేనని గతంలోనే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. దాంతో ఆయన రేస్ నుంచి తప్పుకున్నట్లు అయ్యింది. అయితే, ప్రస్తుతం ఆ పార్టీలో రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు వర్గం దీనిపై స్పందించేందుకు నిరాకరిస్తున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం తమ నాయకుడికే అర్హతలు ఉన్నాయంటూ పోస్టులు పెడుతుండటం గమనార్హం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్