||ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత Photo: twitter||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఢిల్లీలో విచారణకు రావాలని కోరింది. కాగా, ఈ కేసులో మంగళవారం అరెస్టయిన హైదరాబాద్ వ్యాపారి అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరును ప్రస్తావించింది. తాను కవితకు అనుచరుడినని పిళ్లై తెలిపినట్లు ఈడీ పేర్కొన్నది. పిళ్లైతో కలిసి కవితను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్టయ్యారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నోటీసులపై సీఎం కేసీఆర్‌తో చర్చించే అవకాశం ఉంది. గతంలో ఈడీ విచారణ అనంతరం కూడా కవిత కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
కాగా, ఈ కేసులో కవిత విషయంలో ఈడీ ఏం చేయబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు ఈ స్కాంలో విచారించిన అందరినీ ఈడీ అరెస్టు చేసింది. గురువారం విచారణకు రావాలని కవితకు ఈడీ తాజాగా నోటీసులు ఇచ్చింది. దీంతో కవిత కూడా అరెస్టు అవడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా, ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. ’నాకు నోటీసులు అందాయి. 9వ తేదీన హాజరుకావాలని అన్నారు. స్కాంలో నా పాత్ర లేదు. చట్టాలను గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా. తెలంగాణ ఎప్పటికీ ఎవ్వరికీ తలవంచదు. ఈ కుట్రలు బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఏమీ చేయలేవు’ అని పేర్కొన్నారు.