||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్ : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ 400పైచిలుకు స్వల్ప ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్‌పై గెలిచారు. ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసిన అడ్లూరి.. హైకోర్టును ఆశ్రయించారు. దాంతో స్ట్రాంగ్ రూమ్ తెరవాలని కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు స్ట్రాంగ్ రూమ్ తెరవాల్సి ఉన్నా, రూమ్ తాళాలు పోవడం చర్చనీయాంశంగా మారింది. ఘటనపై అడ్లూరి ఆందోళన వ్యక్తం చేశారు.
వాస్తవానికి, స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి జతలు రెండు ఉండాలని, అడిషనల్ కలెక్టర్ నియంత్రణలో ఉండాల్సిన తాళం చెవులు మాయం కావడం ఏమిటని అడ్లూరి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నుంచే తాళంచెవుల కోసం కలెక్టరేట్ సిబ్బంది వెతుకుతున్నా దొరకలేదు. అయితే, స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగలగొట్టాలని అధికారులు భావించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అడ్లూరి.. తాళం చెవి కనిపించకుండా పోయిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి, అనుమతి తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో జగిత్యాల జిల్లా యంత్రాంగం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతోంది.
కాగా, ఈ ఎన్నికపై పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగి ఉండే అవకాశాలు లేకపోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు తాళం చెవి ఉందా? ఉంటే ఎక్కడ పోయింది? అడిషనల్ కలెక్టర్ దగ్గరి నుంచి వేరేచోటుకు చేరిందా? స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఇప్పటికే తెరిచి, అవకవతకలకు పాల్పడ్డారా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.