Delhi LG vs Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్ ఇచ్చిన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్.. 100 కోట్లు డిమాండ్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(ఫొటో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎల్జీ వీకే సక్సేనా)

ఈవార్తలు, నేషనల్ న్యూస్: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ అధికార ఆప్ ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతున్నది. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో ఆప్ పార్టీపై దూకుడుగా వ్యవహరిస్తున్న సక్సేనా.. తాజాగా, మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఆప్ సర్కారు రూ.97.14 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రకటనల పేరుతో కేజ్రీవాల్ సర్కారు రాజకీయ ప్రకటనలు ఇచ్చిందని, దానికి అయిన డబ్బు వెంటనే ఖజానాకు తిరిగి చెల్లించాలని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్‌ను ఆదేశించారు. సమాచార, ప్రసారాల శాఖ నేతృత్వంలో ఏర్పాటైన డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డీఐపీ) కమిటీ.. ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనలపై ఆదేశాలు ఇస్తుంది. అయితే, ఢిల్లీ సర్కారు రాజకీయ ప్రకటనల కోసం ఏకంగా రూ.97,14,69,137 ఖర్చు చేసిందని ఎల్జీ ఆరోపిస్తున్నారు. 2015 నాటి సుప్రీం కోర్టు ఆదేశాలను ఆమ్ ఆద్మీ పార్టీ ఉల్లంఘించిందని ఎల్జీ తెలిపారు.

అయితే, ఎల్జీ ఆదేశాలపై ఆప్ మండిపడింది. ఆ డబ్బును అడిగే అధికారం ఆయనకు లేదని స్పష్టం చేసింది. ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్జీ కొత్త లవ్ లెటర్ అందిందని ఎద్దేవా చేశారు. రూ.97 కోట్లు చెల్లించాలని అడిగే అధికారం ఎల్జీ వీకే సక్సేనాకు లేదని వెల్లడించారు. ఆప్ జాతీయ పార్టీగా ఎదుగుతుంటే బీజేపీకి నిద్ర పట్టడం లేదని విమర్శించారు. బీజేపీ డైరెక్షన్‌లో ఎల్జీ వీకే సక్సేనా పనిచేస్తున్నారని ఆరోపించారు. చట్టం ముందు ఎల్జీ ఆదేశాలు పనిచేయవని తేల్చి చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు ఇచ్చుకొనే అధికారం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రకటనలు ఇస్తుంటాయి. కేంద్రం ప్రకటనల కోసం ఖర్చు చేసిన రూ.22 వేల కోట్లు ఎప్పుడిస్తారో, మేం కూడా రూ.97 కోట్లు అప్పుడే ఇస్తాం’ అని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్