రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (ప్యాక్స్) చైర్మన్లు, డైరెక్టర్లతో కూడిన పాలకవర్గాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
డీసీసీబీ
డీసీసీబీ పాలక వర్గాలు కూడా
సర్కారు ఉత్తర్వులు జారీ
గత ఆగస్టు14తోనే రద్దు
హైదరాబాద్, డిసెంబర్ 19 (ఈవార్తలు): రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (ప్యాక్స్) చైర్మన్లు, డైరెక్టర్లతో కూడిన పాలకవర్గాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు తొమ్మిది జిల్లాలకు చెందిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీఐ) పాలకవర్గాలను కూడా తొలగిస్తూ శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సహకార సంఘాలకు గత ప్రభుత్వం హయాంలో 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. అయితే, పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీరి పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే పూర్తి కావడంతో, ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు వెన్నెముక వంటివి. రైతులకు అవసరమైన తక్షణ సాయాన్ని అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. సాగు అవసరాల కోసం రైతులకు స్వల్పకాలిక , మధ్యకాలిక రుణాలను అందజేయడం చేస్తుంటాయి. వీటితో పాటు.. సొసైటీల ద్వారా సబ్సిడీపై నాణ్యమైన ఎరువులు, విత్తనాలను రైతులకు సరఫరా చేస్తాయి. ప్రభుత్వం మద్దతు ధరతో చేపట్టే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో పీఏసీఎస్ కీలక బాధ్యత వహిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వ్యవసాయ అనుబంధ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం కూడా దీని బాధ్యత. పాలకవర్గాల రద్దు నేపథ్యంలో.. పీఏసీఎస్, డీసీసీబీల నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్ చార్జ్ కమిటీలకు లేదా ప్రభుత్వ అధికారులకు అప్పగించనున్నారు. ముఖ్యంగా తొమ్మిది జిల్లాల డీసీసీబీలకు జిల్లా కలెక్టర్లను బాధ్యులుగా నియమించడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో సహకార ఎన్నికలకు మార్గం సుగమం కానుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈ సంఘాలను పునర్వ్యవస్థీకరించే అవకాశం కూడా ఉందని సమాచారం.