జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై అగ్రనాయకత్వం దృష్టిసారించింది. ఇందుకోసం ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాలను రచిస్తోంది. గడిచిన లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి సీట్లు తగ్గడం, కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లను సాధించడంతో ఆ పార్టీలో ఉత్సాహం నెలకొంది. రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో దూకుడును ప్రదర్శిస్తుండడం, అధికార పార్టీని అనేక అంశాల్లో చిక్కుల్లోకి నెడుతుండడంతో రాహుల్ నాయకత్వం పై ఆ పార్టీ నాయకుల్లో భరోసా పెరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై అగ్రనాయకత్వం దృష్టిసారించింది. ఇందుకోసం ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాలను రచిస్తోంది. గడిచిన లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి సీట్లు తగ్గడం, కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లను సాధించడంతో ఆ పార్టీలో ఉత్సాహం నెలకొంది. రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో దూకుడును ప్రదర్శిస్తుండడం, అధికార పార్టీని అనేక అంశాల్లో చిక్కుల్లోకి నెడుతుండడంతో రాహుల్ నాయకత్వం పై ఆ పార్టీ నాయకుల్లో భరోసా పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీని ఇరకాటంలోకి పెట్టేలా అనేక అంశాల్లో రాహుల్ గాంధీ పార్లమెంటు వేదికగా ప్రసంగించారు. పదునైన ప్రసంగాలతో ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఆకట్టుకుంటున్నారు. రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది అన్న భావనను ఆయన కలిగిస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా ప్రజల పక్షాన ఉండి పోరాడడం ద్వారా 2029 ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అన్న భావన ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ఇన్చార్జిలతో మంగళవారం సమావేశాన్ని ఆ పార్టీ అధిష్టానం నిర్వహించనుంది. ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా పార్టీ బలోపేతానికి సంబంధించి అధ్యక్షులు, ఇన్చార్జులకు కీలక సూచనలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. అనుబంధ సంఘాల కమిటీల నియామకాలపైన ఈ సందర్భంగా అగ్రనాయకత్వం కీలక సలహాలు ఇవ్వనుంది. ఇదిలా ఉంటే ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈ సమావేశంలో కలిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల తరువాత పార్టీకి సంబంధించిన అన్ని విభాగాలను రద్దు చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కమిటీలను రద్దు నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే కొత్త కమిటీలు నియామకం ఉంటుందని అప్పట్లో పార్టీ ప్రకటించింది. కొత్త కమిటీలు నియామకం, రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బలోపేతంపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు పార్టీని బలోపేతం చేయడం, చేరికలు వంటి అంశాలపై షర్మిల పార్టీ అగ్ర నాయకులతో చర్చించనున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన రూట్ మ్యాప్ ను ఆమె ఈ సమావేశానికి తీసుకు వెళ్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల వారీగా ఎవరెవరు పార్టీలో చేరేందుకు అవకాశాలు ఉన్నాయి, జిల్లా అధ్యక్షులు నియామకం, ఇతర అనుబంధ సంఘాల బాధ్యతలను ఎవరికి అప్పగించాలి అన్నదానిపైన ఆమె పార్టీ అధర్ నాయకులతో చర్చించనున్నారు.