తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.. ఒకానొక దశలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.. ఒకానొక దశలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నాయకులపై విమర్శలను గుప్పించారు. రాజీనామాకు సిద్ధమవుతున్న జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపిస్తోంది. తక్షణమే ఢిల్లీకి రావాల్సిందిగా జీవన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సమయంలోనే అధినాయకత్వం నుంచి జీవన్ రెడ్డికి పిలుపు రావడంతో వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నాలను అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్సీ స్వయంగా ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని చెప్పారు. దీంతో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి అవసరమైతే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని చైర్మన్ కు ఫోన్ ద్వారా జీవన్ రెడ్డి సమాచారం అందించారు. కానీ చైర్మన్ నల్గొండ జిల్లా టూర్ లో ఉండడంతో జూన్ 26న రాజీనామా లేఖ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే బుధవారం ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో జీవన్ రెడ్డి విప్ అడ్లూరితో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఇదిలా ఉంటే చేరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పిసిసి నాయకత్వాన్ని ఢిల్లీ పెద్దలు ఇప్పటికే ఆదేశించినట్లు తెలుస్తోంది. చేరికలతో పార్టీకి బలం పెరగాలే తప్ప కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలని రాష్ట్ర నాయకులకు ఢిల్లీ అగ్ర నాయకత్వం సూచించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అలకబూనిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఢిల్లీకి రమ్మన్న కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆయనను సముదాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఇతర మంత్రులకు కూడా ఆదేశాలు వెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నుంచి వచ్చిన పిలుపు నేపథ్యంలో జీవన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారని సమావేశం తర్వాత తేలనుంది.