||కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ Photo: twitter||
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై అప్పీల్ చేయనున్నట్లు సమాచారం. కర్ణాటకలోని కోలార్‌లో మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆయనను దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీల్ చేసుకునేందుకు ఆయనకు కోర్టు 30 రోజుల సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ, రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనున్నట్లు ఓ కాంగ్రెస్ సీనియర్ నేత వెల్లడించారు. అయితే, పిటిషన్‌పై రాహుల్ తరఫు న్యాయవాదులు స్పందించలేదు.
ప్రస్తుతం సూరత్ కోర్టు తీర్పుతో ఎంపీగా రాహుల్ గాంధీ అనర్హత వేటును ఎదుర్కొంటున్నారు. 2019లో కర్ణాటలోని కోలార్‌లో జరిగిన ఓ ఎన్నికల సభలో.. దొంగలంతా మోదీ ఇంటి పేరునే పెట్టుకున్నారెందుకు? అని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మార్చి 23న రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ మరుసటి రోజే ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, రాహుల్ గాంధీ అనర్హత వేటుపై 14 రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 5న సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.